రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వందకు వంద శాతం అమలుచేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతు కళ్లలో వారం ముందే దీపావళి కాంతులను చూసేందుకు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని వివరించారు. రైతు భరోసా కింద రెండున్నరేళ్లలో దాదాపు రూ.18,777 కోట్లు ఇవ్వగలిగామన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంనుంచి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ (పంట రుణాలు), వైఎస్సార్ యంత్రసేవా పథకాల కింద లబ్ధిదారులకు నగదును వారి ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేశారు.
ఆగస్టులో జమ చేసిన రూ.977 కోట్లుపోను మిగిలిన రూ.1,213 కోట్లను ముఖ్యమంత్రి రైతుల ఖాతాల్లో ప్రస్తుతం వేశారు. దీంతో రైతులకు మొత్తం రూ.2,190 కోట్ల లబ్ధి చేకూరినట్లయింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘సున్నా వడ్డీ కింద ఇప్పటివరకూ రూ.1,674 కోట్లు జమ చేశాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1,180 కోట్లతోపాటు తాము రూ.382 కోట్లు లోగడే ఇచ్చాం. ఇప్పుడు మరో రూ.112.7 కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. రాష్ట్రవ్యాప్తంగా రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా 10,750 గ్రామస్థాయి యంత్ర సేవాకేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం’ అని వెల్లడించారు. ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలను చూడడానికే ఈ రాష్ట్రానికి కేంద్ర బృందాలు వస్తే ఈ రోజు రైతుభరోసా కేంద్రాలను చూసేందుకు రాష్ట్రాల నుంచి, కేంద్రం నుంచి బృందాలు వస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌యార్డులను నాడు-నేడు కింద అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు.
గత ప్రభుత్వ బకాయిలనూ కట్టాం
రాష్ట్రంలో దాదాపు 18.7లక్షల మంది రైతులకు పగటి పూటే 9గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు ఈ రెండేళ్లలోనే దాదాపు రూ.18వేల కోట్లను వెచ్చించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన మరో రూ.10వేల కోట్ల బకాయిలను మన ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపెట్టిన రూ.960 కోట్ల ధాన్యం డబ్బులు, రూ.384 కోట్ల విత్తన బకాయిలను చెల్లించామని వివరించారు.
* వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్: 50.37 లక్షల మంది రైతులకు లబ్ధి. ఆగస్టులో విడుదల చేసిన రూ.977 కోట్లతో కలిపి రెండో విడతలో మొత్తం రూ.2,052 కోట్లు ప్రయోజనం.
* వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు: 6.67 లక్షల మంది ఖాతాల్లో రూ.112.7కోట్లు జమ.
* వైఎస్సార్ యంత్రసేవా పథకం: 1,720 రైతు బృందాలకు రూ.25.55 కోట్లు జమ.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో రైతులు వర్చువల్‌గా మాట్లాడారు
* నేను గిరిజన రైతును. మీరు ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలిచ్చిన వెంటనే మూడు దఫాలుగా రైతు భరోసా సాయం అందింది. కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నా. ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి’.
- ఎం.విశ్వేశ్వరరావు, తడిగిరి, విశాఖ జిల్లా
* గతంలో జులైలో ఆకుమడులు వేసుకునేవాళ్లం. డబ్బుల్లేక ఆగస్టు నెలాఖరున ఆకుమడులు పోయడం వల్ల నష్టపోయాం. పంట పండించలేక పిల్లల్ని చదివించలేకపోయాం. ఇప్పుడు రైతుభరోసా వల్ల సకాలంలో పంటలు పండించుకోగల్గుతున్నాం.
హామీలను సంపూర్ణంగా అమలుచేస్తున్నాం