సంక్షేమ పథకాల కొనసాగింపులో భాగంగా మరో నూతన పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం పేరిట నూతన పథకాన్ని ఆరంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏడాదికి 15 వేల చొప్పున ఐదేళ్లకు 75 వేల రూపాయలు ఆర్ధిక సాయంగా 45 ఏళ్లు నిండిన కాపు సామాజిక వర్గ మహిళలకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఆర్హులను గుర్తించేందుకు వివిధ అంశాలను పేర్కొంటూ బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఉత్తర్వులు ఇచ్చారు. త్వరితగతిన లబ్దిదారులను గుర్తించాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మార్గదర్శకాలు విడుదల
వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందించనుంది. కాపు, ఒంటరి, బలిజ, తెలగ, ఉపకులాలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున సాయం చేయనున్నారు.
ఈ పధకం కింద ఆర్ధిక చేయూతను అందుకునే లబ్దిదారుల కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేలు మించకూడదని నిబంధన విధిస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం వర్తించదని ఉత్తర్వుల్లో తెలిపారు. మొత్తంగా ఈ నిబంధనల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపును ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరోవైపు వైఎస్ఆర్ కాపునేస్తం పథకం లబ్దిదారులకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూదని స్పష్టం చేశారు. అలాగే ఆదాయపన్ను చెల్లింపుదారు కుటుంబాలకు ఈ పథకం వర్తించదని ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి...'కరోనా'కు మందు కనుగొన్న తమిళ వైద్యుడు!