Sravani's Kitchen: పట్టుదలకు శ్రమతోడైతే మనకున్న నైపుణ్యాలతోనే ఎంతో సాధించవచ్చు అనడానికి నిదర్శనం శ్రావణి గూడ. చదువుకునే రోజుల్లో ఇంట్లో వంటా వార్పూ తనదే. సరదాలూ షికార్ల సంగతలా ఉంచితే అసలు తీరికే దొరికేది కాదు. అప్పుడు నేర్చుకున్న నైపుణ్యాలే ఇప్పుడామెను యూట్యూబ్ స్టార్‌గా నిలిపాయి. తెలుగులో అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న ఛానెళ్లలో ఆమె ‘శ్రావణీస్ కిచెన్’ ఒకటి. ఇదెలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే..
పెళ్లైన కొత్తలో ఇంటి బాధ్యతలు. తర్వాత పిల్లలు.. టైమ్ ఉండేది కాదస్సలు. పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మొదలు పెట్టాక చాలా ఖాళీ దొరికేది. ఇంట్లో ఉండే ఏం చేయొచ్చా అని ఆలోచించా. వంటలు బాగా చేస్తానని మావాళ్లంటారు. అందుకని యూట్యూబ్ ఛానెల్ పెడతాననగానే మావారు ప్రోత్సహించారు. 2016లో ‘శ్రావణీస్ కిచెన్’ని మొదలుపెట్టా. ఫోన్లోనే వీడియోలు తీసేదాన్ని. ఎడిటింగ్ మావారే నేర్పించారు. కానీ ఇంటి పనుల ఒత్తిడిలో కొనసాగించలేకపోయా.
2018 నుంచి మాత్రం టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్‌కి ఇంట్లో ఏం చేస్తే అవి వీడియో తీసి పెట్టేదాన్ని. 2020 ఫిబ్రవరికి 7-8 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉండేవారు. లాక్‌డౌన్ మొదలయ్యాక ఏప్రిల్‌కల్లా ఆ సంఖ్య పది లక్షలకు చేరింది. గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. తెలుగు వంటల ఛానెళ్లలో ఆ ఘనత అందుకున్న తొలి మహిళని నేనే. వీడియోలో కనిపించాలంటే నాకు కాస్త బెరుకుండేది.
ఈ మైలురాయి చేరుకున్నాక ‘నువ్వు వీక్షకులకి కనిపించాల్సిందే’నన్నారు మావారు. అలా ఆయన ఒత్తిడితో మొదటిసారి నా పరిచయ వీడియో చేశా. ఇక అప్పటినుంచి కనిపిస్తూనే వంటల్ని వివరిస్తున్నా.
వంట అలా అలవాటైంది..మాది తెలంగాణాలోని కోరుట్ల.. నా చిన్నపుడు ముంబయిలో ఉండేవాళ్లం. నాకిద్దరు అక్కలు, అన్నయ్య. అక్కలిద్దరూ చదువుకోలేదు. చిన్నదాన్ని కదాని నన్ను చదివించారు. నేను ఇంటర్లో ఉండగా అక్కల పెళ్లి ప్రయత్నాల కోసం వాళ్లని తీసుకుని అమ్మ ఊరు వచ్చేసింది. దాంతో ఇంటి పనీ, నాన్న, అన్నయ్య, నాన్నమ్మలకి వంటా నేనే చేసేదాన్ని. వాళ్లకోసమే వంటలు నేర్చుకున్నా. రోజూ ఒకేలాంటివి చేస్తే నాకే బోర్ కొట్టేది.. ఇక తినేవాళ్ల సంగతేంటి అనిపించేది. దాంతో కొత్త వంటల గురించి చుట్టుపక్కల తెలుగువాళ్లతోపాటు మరాఠీ వాళ్లని అడిగి చేసేదాన్ని. అవి తిని వాళ్లూ మెచ్చుకునేవారు. డిగ్రీ అవ్వగానే పెళ్లి కావడంతో హైదరాబాద్ వచ్చా. మావారు రాజేశ్... మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.