ఆసుపత్రిలో యువకుడు మృతి.. బంధువుల ఆందోళన - DOCTORS
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి.. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతని మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.
కృష్ణా జిల్లా కానూరుకు చెందిన వరప్రసాద్‌కు ఇటీవల ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు అతన్ని విజయవాడ నూతన ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరా ఆగినందునే.. వెంటిలేటర్‌పై ఆక్సిజన్ అందక వరప్రసాద్ మృతి చెందాడని అతని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మృతుని బంధువుల ఆరోపణల్లో వాస్తవం లేదని.. వెంటిలేటర్‌కు 6 గంటల పాటు బ్యాకప్ సామర్థ్యం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ బాబూలాల్ వివరించారు. కరెంట్ కోతతో ప్రాణం పోయిందని ఆరోపించడం సరికాదన్నారు.