ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న యువ ఉద్యోగులు - తెలంగాణలో కరోనా మృతులు

రెండోదశ కొవిడ్‌ కల్లోలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ శాఖలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ప్రభావితం అవుతున్నారు. గతంతో పోలిస్తే కేసులతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. ఈ దఫా యువ ఉద్యోగులు గణనీయ సంఖ్యలో ప్రాణాల్ని కోల్పోతున్నారు. ఉద్ధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా కరోనా కాటు నుంచి తప్పించుకోలేకపోతున్నారు.

corona effect on youth employees
corona effect on youth employees

By

Published : May 22, 2021, 8:01 AM IST

కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో నాలుగు పదుల వయసుకు ఐదారేళ్లు అటూఇటుగా ఉంటున్నవారే అధికం. మహిళలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. విధుల్లో భాగంగా ఇంటి నుంచి కార్యాలయానికి వచ్చే క్రమంలో, కార్యాలయాల్లో వివిధ రకాల నివేదికల తయారీ, ఇతర శాఖలకు చెందిన సిబ్బందితో మంతనాలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మహమ్మారికి చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్య ఆరోగ్య, పోలీసుశాఖలకు చెందిన ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉంది.

కేంద్ర ప్రభుత్వశాఖల్లో రైల్వే, తపాలా, బ్యాంకు ఉద్యోగులది కూడా ఇదే పరిస్థితి. 'ఆక్సిజన్‌ సరఫరా, టీకాల పంపిణీ, ఆసుపత్రుల వద్ద పర్యవేక్షణలో మేమే కీలకం. వీఆర్‌ఏ స్థాయి నుంచి రెవెన్యూ ఉద్యోగులు విధుల్లో ఉండటంతో ఇప్పటికే 40 మంది వరకు యువకులైన ఉద్యోగుల్ని కోల్పోయాం' అని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమసంఘం తెలిపింది. నిరంతరం ప్రజల మధ్య విధులు నిర్వహించాల్సి రావడంతో ఇప్పటికే 4వేల మంది పోలీసులు, అధికారులు కరోనా బారినపడగా కొందరు యువ ఉద్యోగులు మరణించినట్లు రాష్ట్ర పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నాయకుడు ఒకరు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల వైద్యానికి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలని వివిధ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

వివిధ శాఖల్లో కొవిడ్‌ విషాదాలు..

*రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు చెందిన ఇంజినీర్లు ఎక్కువ సంఖ్యలో బలయ్యారు. వీరిలో 40 ఏళ్లలోపు వారు 8 మంది కాగా.. ఐదుగురు డివిజనల్‌ ఇంజినీర్‌ (డీఈ) స్థాయి అధికారులు, ఇద్దరు కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఈఈ), క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈ ఒకరు ఉన్నారు.
*పంచాయతీరాజ్‌ శాఖలోని ఇంజినీరింగ్‌ విభాగంలో ఏడుగురు ప్రాణాలు వదిలారు. వారిలో ముగ్గురు డీఈలు, ఒక ఈఈ, మిగిలినవారు క్షేత్రస్థాయి ఇంజినీర్లు. మరో 11 మంది ఇతర ఉద్యోగులు ఉన్నారు.
*వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఏప్రిల్‌, మే నెలల్లో 26 మంది చనిపోయారు. అందులో 14 మంది ఈ 20 రోజుల వ్యవధిలోనే ప్రాణాలు వదిలారు. మిషన్‌ భగీరథ ఇంజినీర్లు ముగ్గురు, ర.భ శాఖవారు ఇద్దరు ఉన్నారు.
*విద్యుత్తుశాఖలో మొత్తం 80 మంది ఊపిరి ఆగింది. వీరంతా 45 ఏళ్ల వయసు పైబడిన వారు. పోలీసుశాఖలో ఏకంగా నాలుగువేల మంది కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు 20 మంది మధ్య వయస్కులు మృతిచెందారు.
*ద.మ. రైల్వే పరిధిలో దాదాపు 310 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇందులో 45 ఏళ్లలోపువారు 110 మంది అని రైల్వే వర్గాల సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది టీటీఈలే.
*అటవీశాఖలో 300 మందికి పాజిటివ్‌ రాగా ఇందులో 20 మంది మరణించారు. వీరిలో క్షేత్రస్థాయిలో పనిచేసే బీట్‌ అధికారులే ఎక్కువ. వీరంతా దాదాపుగా 45 ఏళ్లలోపువారే.
*తెలంగాణ తపాలా సర్కిల్‌లో ఇప్పటివరకు 900 మంది కరోనాకు గురయ్యారు. 500 మంది కోలుకోగా, 400 యాక్టివ్‌ కేసులున్నాయి. 46 మంది ఉద్యోగులు మరణించారు.
*భద్రాద్రి జిల్లా కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ జయసుధ (36) మూడ్రోజులక్రితం కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనాతో పోరాడినప్పటికీ ప్రాణం నిలవలేదు.
*హైదరాబాద్‌ టీఎస్‌ఎండీసీలో జనరల్‌ మేనేజర్‌ దీప్తి (41) మూడ్రోజులక్రితం కొవిడ్‌ అనంతర చికిత్సపొందుతూ మరణించారు.
*వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిశోర్‌ నాలుగురోజుల క్రితం కరోనాతో పోరాడి ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం రామేశ్వరం కార్యదర్శి మణికంఠ(29) చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇదీ చూడండి:

కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details