తనిఖీల విషయంపై చంద్రబాబుకు ముందే చెప్పారు: వైకాపా - airport checking
గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును సాధారణ ప్రయాణికుడిలా ట్రీట్ చేయడంపై వైకాపా స్పందించింది. ప్రతిపక్ష నేతకు విమానాశ్రయంలో జెడ్ ఫ్లస్ అర్హత లేదని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారని వెల్లడించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గన్నవరం విమానాశ్రయంలో తనిఖీలు చేసి అవమానపరచినట్లు వచ్చిన విమర్శలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానమిచ్చింది. ఏయిర్ పోర్ట్ ఆథారిటీ నియమ నిబంధనల ప్రకారమే ముందుగా ఈ విషయాన్ని చంద్రబాబుకి చెప్పే చేశారని ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత అయ్యాక ఇది రెండవ తనిఖీ అని విజయవాడ వైకాపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పత్రికలు వాస్తవాలు తెలుసుకుని రాయాలని ఆయన కోరారు. తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ.... నిన్న జరిగిన తెదేపా వర్కషాప్లో ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏ వ్యక్తిపైనా, ఏ పార్టీకి చెందిన వారిపైనా ఎలాంటి దాడులు చేయరాదని, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హెచ్చరించారని ఎమ్మెల్యే తెలిపారు. తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నప్పుడే అధికారులు, కార్మికులు, అంగన్‌వాడీ ఉద్యోగులపైనా జరిగిన దాడులు జరిగాయని విమర్శించారు.