రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలని తెదేపా(TDP) ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కన్నబాబు(minister kannababu) ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబే ఉన్నారన్నారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే అధికార ప్రతినిధి ద్వారా బూతులు మాట్లాడించారని మండిపడ్డారు. తెదేపా అధినేత 36 గంటల దీక్షలో అందరిచేత సీఎం జగన్(CM JAGAN)ను తిట్టించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు(CHANDRABABU) ఎందుకు దీక్ష చేశారో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికే తెలియదని విమర్శించారు. బద్వేలు(BADVEL), తెలంగాణలోని హుజురాబాద్(HUZURABAD)లో పోటీ చేయని తెదేపా.. జాతీయ పార్టీ ఎలా అయ్యిందో ఎవరికీ తెలియదన్నారు.
స్థానిక ఎన్నికలను బహిష్కరించినట్లు చెప్పిన తెదేపా నేతలు దుగ్గిరాలలో ఎలా గెలిచారని ప్రశ్నించారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలో గెలిచి చూపితే ఆనందిస్తామన్నారు. అధికారంలోకి వస్తే.. మొదటి ఆరు నెలలు వైకాపా నేతల అంతు చూస్తామని చెబుతున్న తెదేపాది.. పరిపాలన కోసం ఆరాటం కాదా అని ప్రశ్నించారు.
వైకాపా కార్యకర్తలపై చేయి పడితే సీఎం జగన్ చూస్తూ ఊరుకుంటారా అని కన్నబాబు నిలదీశారు. సీఎంను తిట్టిన పదంతో.. రాష్ట్రపతి, ప్రధానిని సంభోదించగలరా అని ధ్వజమెత్తారు. తెదేపా పార్టీ కార్యాలయం దేవాలయం అయితే.. ఆ పార్టీ దేవుడు ఎన్టీఆర్పైనే రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. జగన్పై బురద జల్లేందుకే.. చంద్రబాబు దిల్లీ పర్యటన అని విమర్శించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ఉగ్రవాదం తెదేపా చేస్తోందని ఆయన ఆరోపించారు.
సంక్షేమ పథకాలు చూసి.. ప్రతిపక్షాలు ఓర్వటం లేదు
ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా.. చట్టపరంగా జైలుకు పంపడం జరుగుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(minister muttamshetty srinivas rao) అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు.. ఆ పార్టీ నేత మాట్లాడిన బూతులను సమర్ధిస్తూ 36 గంటల దీక్ష చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నడుచుకోవాలని మంత్రి ముత్తంశెట్టి హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి.. ఓర్వలేని ప్రతిపక్షానికి ఇక నూకలు చెల్లాయని అన్నారు.