'సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే అందుకు ముఖ్యమంత్రి జగన్(cm jagan) ఎప్పుడూ ఓపెన్‌గానే ఉన్నారు' అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 'కానీ, అలాంటి పరిస్థితి ఉందని అనుకోవడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయినట్లు ఏమీ లేదు. వారి(తెలంగాణ) మంత్రిమండలిలో మాట్లాడుకున్నారని, బయట ఏవో నాలుగు వ్యాఖ్యల్లాంటివి మాత్రమే వస్తున్నాయి' అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన వైకాపా కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ(telangana) నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తుండడంపై విలేకరులు అడగ్గా.. సజ్జల స్పందిస్తూ.. 'మా పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించినంతవరకు ఇరుగుపొరుగు రాష్ట్రాలతో వీలైనంతవరకు సత్సంబంధాలు కలిగి ఉండాలి. మన ప్రయోజనాలను కాపాడుకోవడమే మన స్టాండ్, మనం మాట్లాడే మాటల్లో సంయమనం పాటించండి. మనం మాట్లాడితే సమస్య పరిష్కారమయ్యేలా ఉండాలే తప్ప, సంబంధం లేని ఆగ్రహావేశాలు పెరగడం, ప్రాంతాలు, వర్గాల మధ్య విభేదాలు పెంచేలా ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ మాకు చెబుతారు. వారు(తెలంగాణ) మాట్లాడిన మాటలకు రెండింతలు ఇక్కడ నుంచి మాట్లాడగలం. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అటువైపు(తెలంగాణ) కొన్ని శక్తులు తెలంగాణ విడిపోయాక కూడా ఇంకా ఆ పేరుమీదనే ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి.' అని సజ్జల అన్నారు.
ఏపీలో వైకాపా ప్రభుత్వం వచ్చాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించారు. అప్పుడు రాయలసీమను ఆదుకునేందుకు ఎంతవరకైనా వెళ్లాలి, నేను రెండడుగులు ముందుండి నడిపిస్తా అని చాలా ఔదార్యంతో కేసీఆర్ హామీ ఇచ్చారు. కృష్ణా నదిలో వస్తున్న వరద తగ్గిపోయింది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎత్తిపోసి, నిల్వ చేసుకుంటే తప్ప రాయలసీమకు మోక్షం ఉండదనీ అంగీకరించారు. మనం(ఏపీలో) ఇప్పుడు చేసుకుంటున్న ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కేటాయింపులకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకోకుండా, వరద జలాలను ఒడిసిపట్టి వాటిని నిల్వ చేసేందుకు ఉన్న వనరులను పెంచుకునేందుకు చేస్తున్నవే. రాయలసీమ ఎడారి కాకుండా కాపాడుకునేందుకు కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టుకునేందుకు మనం(ఏపీ) చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఏర్పాట్లకు తెలంగాణ నుంచి పూర్తి సహకారం, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, ఆశీస్సులుంటాయనే ఆశిస్తున్నాం.
-జ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వ సలహాదారు