వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టూ చేపట్టింది లేదని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని విమర్శించారు. విజయవాడలోని దుర్గగుడి పైవంతెన ప్రారంభోత్సవంలో... ఆయన దిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో పోలవరం, అమరావతిని గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
కనకదుర్గ పైవంతెన కోసం తెదేపా అనేక పోరాటాలు చేసింది. తెదేపా హయాంలో గడ్కరీ సహకారంతో ప్రాజెక్టును కీలక దశకు తెచ్చాం. తెదేపా హయాంలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు. తెదేపా తీసుకువచ్చిన ప్రాజెక్టులకు ప్రస్తుత ప్రభుత్వం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోంది. రూ.2,600 కోట్లతో బైపాస్ రోడ్డు కొత్తగా వచ్చింది. 189 కి.మీ ఓఆర్‌ఆర్‌ను సీఎం అడుగుతారని భావించా.. కానీ అడగలేదు. రూ.200 కోట్లతో ఈస్ట్రన్ బైపాస్ మాత్రం అడిగారు. కనకదుర్గ పైవంతెన సాధ్యం కాదని నాటి ప్రతిపక్షాలు విమర్శించాయి. వ్యవస్థలను నాశనం చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. - కేశినేని నాని, ఎంపీ