లైమ్ స్టోన్ అక్రమ తవ్వకాల ఆరోపణల కేసు విషయంలో.. తనను పోలీసులు అరెస్టు చేయకుంటా ఆదేశాలు ఇవ్వాలంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ తదితరులకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ ఆగస్టు 1కి విచారణను వాయిదా వేసింది.
''నా అరెస్టును నిలువరించండి''
తనను అరెస్టు చేయకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హై కోర్టులో పిటిషన్ వేశారు.
వాదోపవాదాలు.. వివరాలు
లైమ్ స్టోన్ వ్యవహారంలో... సీఐడీ దర్యాప్తు చేస్తున్న విషయాన్ని పిటిషనర్ తరపున న్యాయవాది వేదుల వెంకటరమణ కోర్టు దృష్టికి తెచ్చారు. అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారి నుంచి సొమ్ము రాబట్టాలని దాఖలైన ఓ వ్యాజ్యం.. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద పెండింగ్ లో ఉందన్నారు. పిటిషనరకు అక్రమ మైనింగ్ విషయంలో పాత్ర లేదంటూనే.. దర్యాప్తు అధికారులు నోటీసు జారీ చేయవచ్చని.. పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు . అడ్వొకేట్ జనరల్ ( ఏజీ ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కేవలం ఆందోళన కారణంగా యరపతినేని కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్ లలో ఆయన పేరు లేదన్నారు. పోలీసుల చర్యలను నిలువరించాలనే కారణంతో వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందనీ.. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణ వాయిదా వేశారు.