విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రాన్ని దారాదత్తం చేశారని తెలుగుదేశం ఆరోపించింది. వారికి జిల్లాల బాధ్యతలు అప్పగించటంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. కిచెన్ క్యాబినెట్ ఏర్పాటుతో రాష్ట్ర మంత్రివర్గాన్ని జగన్ రబ్బర్ స్టాంప్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని విస్మరించి రెడ్డి రాజ్యం స్థాపించాలని సీఎం యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తోలుబొమ్మ మంత్రులతో అందరినీ తన చేతుల్లో పెట్టుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు. కిచెన్ క్యాబినెట్ ఏమి చెప్తే... రాష్ట్ర మంత్రివర్గం అది చేస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన ఈ అప్రజాస్వామిక చర్య రాజ్యాంగంలోని 73, 74 నిబంధనలకు వ్యతిరేకమన్నారు. గ్రామ వాలంటీర్ల నుంచి కిచెన్ క్యాబినెట్‌కు సంబంధాలు నెలకొల్పారన్న యనమల.. 600 నామినేటెడ్ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. బడుగు వర్గాలను ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తారని స్పష్టంచేశారు.