ప్రధాని మోదీ వ్యాఖ్యలు సీఎం జగన్ కేసులో అక్షర సత్యమని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. 'అవినీతి కేసుల విచారణలో జాప్యం భవిష్యత్ కుంభకోణాలకు పునాది అవుతుంది' అన్న ప్రధాని మాటలు జగన్కు సరిపోతాయని అన్నారు.
అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే ఆలస్యం ఒక శృంఖలంలాగా భవిష్యత్ కుంభకోణాలకు పునాది రాయిగా ఎలా మారుతుందన్నదానికి ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పాలనే ఉదాహరణ అని యనమల దుయ్యబట్టారు. సీబీఐ, ఈడీ వంటి విచారణ సంస్థలు వేగవంతంగా పనిచేసేలా చేసి ఆర్థిక నిందితులపై చర్యలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గుర్తుచేశారు.
ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్ళను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారని యనమల గుర్తు చేశారు. కార్యాచరణను మళ్లీ జాప్యం చేయడానికి 16 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ న్యాయ వ్యవస్థపై దాడి ప్రారంభించారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని వ్యాఖ్యలు కీలకం కానున్నాయని యనమల అభిప్రాయపడ్డారు.