Yanamala comments on the financial manipulations: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రం జోక్యం చేసుకుని.. సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. రూ.48 వేల కోట్లకు లెక్కల్లేవని ఆరోపణలు చేశారు. లెక్కలు చెప్పలేకపోతే.. ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేల్చాలన్నారు. స్పెషల్ బిల్లుల పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందని.. స్పెషల్ బిల్లులనేవి ట్రెజరీ కోడ్‌లోనే లేదని యనమల అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని మండిపడ్డారు.కేంద్రం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతుందేం లేదు. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారు.ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోంది.కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోంది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సుమారు రూ. లక్ష కోట్లు తెచ్చారు.. దానికి సంబంధించిన లెక్కలు చెప్పలేదు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కలు కూడా బడ్జెట్ లెక్కల్లో చూపాలని 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది. 2024 నాటికి రూ. 8-9 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి.రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది. -యనమల రామకృష్ణుడు,శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత