తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. వందల మంది పోలీసులతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. కోనసీమ ప్రాంతంలో రసాయన పరిశ్రమలతో మత్స్యకారుల జీవనోపాధికి గండి పడుతుందన్నారు. తెదేపా సహా ప్రతిపక్షాల హెచ్చరికలను బేఖాతరు చేయడం గర్హనీయమని ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతును నొక్కేయడం అప్రజాస్వామికమన్నారు.
పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దమనకాండతో జగన్ ఇప్పటికే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. అన్ని జిల్లాల్లో అశాంతి, అభద్రతతో నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని తయారు చేశారన్నారు. జంగిల్ రాజ్‌గా, పోలీస్ రాజ్‌గా రాష్ట్రాన్ని మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర పరిస్థితులు ప్రజాస్వామ్యవాదులను తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఇకనైనా చేసిన తప్పులను సరి దిద్దుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని యనమల హితవు పలికారు.