వస్తుంది, పోతుందనటానికి కరోనా ఏమైనా జగన్ చుట్టమా అని తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. మరణాలు దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన మండిపడ్డారు. కరోనాపై వాస్తవాలను వైకాపా నేతలు నేతలు తొక్కేస్తున్నారని దుయ్యబట్టారు. ఎక్కువ పరీక్షల వల్లే కేసులు ఎక్కువని చెప్పడం ఆత్మవంచనతో పాటు రాష్ట్ర ప్రజలను మోసం చేయడమనని అగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిపై అంతర్జాతీయంగా అంతా తలలు పట్టుకుంటుంటే జగన్ మాత్రం ప్రమాదం లేదన్నట్లుగా చెప్పడం ఆత్మ వంచనేనన్నారు. చిన్న జ్వరం లాంటిదని చెప్పడం జగన్ మనస్థత్వానికి దర్పణమన్న యనమల రాజకీయ లాభాల కోసం ప్రజల ప్రాణాలనే బలిపెట్టడం ఫ్యాక్షనిజానికి పరాకాష్టగా అక్షేపించారు.
కరోనా ఏమైనా మీ చుట్టమా..?: యనమల - వైకాపా పై తెదేపా నేతలు విమర్శలు
కరోనాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరోనా వస్తుంది, పోతుందనటానికి అదేమైనా మీ చుట్టమా అని ప్రశ్నించారు.
దేశంలో కరోనా ఎక్కువ ఉన్న 15జిల్లాలలో కర్నూలు కూడా చేరటం జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదని... సీఎం నిర్లక్ష్యం వల్లే మొదట్లో యంత్రాంగం తేలిగ్గా తీసుకుందని యనమల విమర్శించారు. కరోనా వృద్దిరేటులో దేశంలో 2వ స్థానంలో ఏపీ ఉందన్న ఆయన... వారం రోజుల్లోనే ఏపీ తెలంగాణను దాటి త్వరలోనే తమిళనాడును అధిగమించేలా ఉందన్నారు. దక్షిణాదిన డిశ్చార్జ్ రేటులో తమిళనాడు 1,210తో తొలిస్థానంలో ఉంటే, తెలంగాణ 409తో 2వ స్థానం, కేరళ 369తో 3వ స్థానం, ఏపీ 287తో అడుగునుంచి 2వ స్థానంలో ఉందన్నారు. ఇందులోనే వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం బైటపడిందని మండిపడ్డారు. వైకాపా నాయకులే గుంపులుగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారనే దానికి వారు నిర్వహించిన సమావేశాలే ప్రత్యక్ష రుజువులన్నారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:నంద్యాలలో అధికారుల మధ్య పాస్‌ల వార్