ముఖ్యమంత్రి జగన్ అహంభావానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదో వంక పెట్టి ఎన్నికలను ఆపాలని చూడటం, దీనికి ఉద్యోగ సంఘాల నాయకులు వత్తాసు పలకడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తోందన్నారు.
రెండో ఆలోచన లేకుండా వెంటనే పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనా, ఇందుకు సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనా ఉందని యనమల స్పష్టం చేశారు. రాజ్యాంగ విధులను, విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎవరైనా అరాచకాలు సృష్టించాలని చూస్తే ఎన్నికల సంఘమే తగిన చర్యలు చేపట్టాలన్నారు.