తిరుపతి ఉపఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే హక్కు వైకాపాకు లేదని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు లేఖ రాయటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నా... 5 లక్షల మెజార్టీ వస్తుందని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు ప్రచారానికి వస్తుండటం ఓటమి భయమేనని విమర్శించారు.
" సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖలు రాయాల్సింది తిరుపతి ప్రజలకు కాదు. దమ్ముంటే ప్రత్యేక హోదా, విభజన సమస్యలు, స్టీల్ ప్లాంట్ వ్యవహారం వంటి వాటిపై ప్రధాని మోదీకి లేఖలు రాసి నిలదీయాలి. వైకాపాకు ఓటెందుకెయ్యాలో సమాధానం చెప్పాకే జగన్ తిరుపతిలో అడుగు పెట్టాలి. రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపటంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ఇంధన ధరలు పెంచాయి. రైతు రుణమాఫీ రద్దు చేయకుండా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నారు. విపత్తుల్లో ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. ఇసుక, మద్యం, సిమెంట్ ధరలు పెంచేసి జే-ట్యాక్స్ దండుకుంటున్నారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి, సీపీఎస్ రద్దు హామీని విస్మరించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తూ...బీసీ,ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల్లో కోత పెట్టి రిజర్వేషన్లు కుదించేశారు. విద్యార్థులకు వివిధ పథకాలు దూరం చేసి నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పించలేదు."-యనమల, మాజీ మంత్రి