Yanamala on State Finance: రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు 38 నుంచి 43శాతానికి పెరిగాయని తెదేపా యనమల రామకృష్ణుడు వెల్లడించారు. రెండున్నరేళ్లలో జగన్ తన పాలనతో రాష్ట్రాన్ని అథఃపాతాళానికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. తిరోగమన వృద్ధి నుంచి, రెండంకెల వృద్ధి సాధించేందుకు.. జగన్ ప్రభుత్వ కార్యాచరణను గ్రీన్ పేపర్ ద్వారా బయట పెట్టాలన్నారు. ఆర్ధిక క్రమశిక్షణ వదిలేసి, అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని దిగజార్చడంపై చర్చ చేసేందుకు గ్రీన్ పేపర్ విడుదల చేయాలన్నారు.
మార్కెట్ రుణాలను, ఆఫ్ బడ్జెట్ అప్పులు మించిపోవడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. మూలధన వ్యయం అంతకంతకు అడుగంటుతోందన్నారు. అవుట్ స్టాండింగ్ అప్పులకు హద్దు, అదుపు లేకుండా మొత్తం అప్పు రూ.7లక్షల కోట్లకు చేరుతోందన్నారు. 2020-21లో తలసరి ఆదాయం 1.4శాతం క్షీణించిందని, ద్రవ్యోల్బణం ప్రస్తుతం 14.2శాతానికి (హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్) పెరిగిందన్నారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కట్టుదాటడంతో, ధరలు చుక్కల్లోకి దూసుకుపోతున్నాయన్నారు. ఉచితాలు, రాయితీలకు మంగళం పాడారని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. పేదల ముక్కుపిండి బలవంతపు వసూళ్లకు పాల్పడితే, ప్రజల చేతిలో వైకాపా బలికాక తప్పదని స్పష్టం చేశారు. తన చేతగానితనం, మొండితనం రాష్ట్రానికి ఎంత నష్టం చేసిందో జగన్ రెడ్డి సమీక్షించాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.