తెలంగాణ తిరుపతిగా ఖ్యాతిగాంచిన యాదాద్రి క్షేత్ర అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. శివాలయం పునర్నిర్మాణంలో ప్రవేశ మార్గాల కల్పనకు యాదాద్రి పట్టణ అభివృద్ధి సంస్థ దృష్టి కేంద్రీకరించింది. కొండపై ప్రధానాలయం పంచ నారసింహుల సన్నిధికి తూర్పు దిశలోని శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి(శివాలయం) ఆలయాన్ని విస్తరించి పునర్నిర్మిస్తున్నారు.
అర ఎకరం పైగా విస్తీర్ణంతో నిర్మితమైన ఆలయ ప్రహరీలో నుంచి వెళ్లేందుకు స్వాగత తోరణం ఉత్తర దిశలో ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి తూర్పు దిశలో గల ప్రవేశ మార్గం ద్వారానికి సంప్రదాయబద్ధంగా హంగులను తీర్చిదిద్దే పనులు వేగవంతం చేసినట్లు ఆలయ స్థపతి ఆనందాచారి వేలు తెలిపారు.