Bhuvanagiri Govt doctors negligence : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. ప్రసవం కోసం వెళ్లి... ఇన్ఫెక్షన్తో బాధితులు మంచానికే పరిమితం అయ్యారు. ఇటీవల శస్త్రచికిత్స జరిగిన ఎనిమిదిమంది మహిళలకు ఇదే పరిస్థితి. ఆపరేషన్ చేసిన తర్వాత... కుట్లు విడిపోయి నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందికి ఇన్‌ఫెక్షన్ సోకి.. ఆ నొప్పిని భరించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఓవైపు నొప్పులు భరించలేక తల్లుల ఏడుపులు... మరోవైపు అమ్మకోసం పసివాళ్ల కేకలతో బాధిత కుటుంబసభ్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలోని భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల దీనస్థితి ఇదీ.
ఏం జరిగింది?
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు ఏడు రోజుల కిందట 8 మంది మహిళలకు శస్త్రచికిత్స చేశారు. మహిళలకు ఆపరేషన్ చేసిన చోట కుట్లు విడిపోయి... ఇన్‌ఫెక్షన్ సోకిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నొప్పిని భరించలేక బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వారందరికీ రోజూ డ్రెస్సింగ్ చేసినా... రోజు రోజుకూ కుట్లు విడిపోతున్నాయని, వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. 'ఇదేంటని అడిగితే.. మీరు చేయండి' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యంగా సమాధానం
దీనిపై బాధిత కుటుంబ సభ్యులు... వైద్యులను నిలదీయగా... కుట్లు విడిపోయిన చోట మరోమారు కుట్లు వేస్తామని వైద్యులు చెబుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన తాము మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్లు విడిపోయి... అవస్థ పడుతున్నామని... ఇది గమనించి మెరుగైన వైద్యం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
'ప్రభుత్వ దవాఖానా అని వస్తే... సరిగా పట్టించుకుంటలేరు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ... మందులు మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. ఆస్పత్రి కింది స్థాయి సిబ్బంది ప్రతీ సేవకు ఓ రేటును నిర్ణయించారు. డబ్బులు ఇవ్వనిదే సేవలు అందించటం లేదు. మా వద్ద పైసలుంటే ఉంటే ప్రైవేటు ఆస్పత్రికే వెళ్లే వాళ్లం కదా.'