Wife fights for husband: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మరో పెళ్లికి సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ ఘటన గురువారం.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలు బస్తీ ఏరియాలో సంచలనంగా మారింది. బాధితురాలు జాలాది సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన సుజాత, ఇల్లెందు పట్టణంలోని సబ్‌జైలుబస్తీ ఏరియాకు చెందిన బి.వంశీ 2013లో ప్రేమించుకుని, 2017లో ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారక తిరుమల ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో వంశీ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కొవ్వూరు పోలీసు స్టేషనులో కేసు పెట్టారు. ప్రస్తుతం కేసు కోర్టులో కొనసాగుతుంది.
రెండో వివాహమా.?:భార్యాభర్తల వివాదం నేపథ్యంలో తనకు గతంలోనే వివాహం జరిగిందని వంశీ చేసిన ఆరోపణలపై న్యాయస్థానాల్లో కేసులు జరిగాయని సుజాత తెలిపారు. తనకూ, వంశీకి ఇద్దరికీ తొలి వివాహమే జరిగిందని.. వంశీ చేసిన తప్పుడు ఆరోపణలను రాజమండ్రి జిల్లా న్యాయస్థానం కొట్టివేసిందని వివరించారు. కొవ్వూరు జిల్లా న్యాయస్థానంలో ప్రస్తుతం మూడు కేసులు నడుస్తున్నాయని.. తాను, వంశీ వాయిదాలకు వెళ్లడం జరుగుతోందని చెప్పారు. వివాదాలు నడుస్తుండగానే రెండేళ్లుగా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. తన కంటే ఎక్కువ కట్నం వస్తుందని చెబుతున్నాడని భార్య ఉండగానే మరో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో వంశీ పట్టణంలోని సబ్‌జైలుబస్తీకి చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. గురువారం స్థానిక 24 ఏరియా సింగరేణి వైసీఓఏ క్లబ్‌లో ఉదయం 9 గంటలకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పెళ్లిని అడ్డుకునేందుకు వైసీఓఏ క్లబ్ వద్దకు వచ్చి ఎవరూ లేకపోవడంతో వధూవరుల ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈక్రమంలో పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు, సుజాతకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.