ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు! - Wife replica with silicone wax at vijayawada

ఆమె రూపం అతని కళ్ల నుంచి దూరం కావడంలేదు. ఆమె జ్ఞాపకాలు.... హృదయాంతరాలను దాటలేకపోతున్నాయి. జీవితాంతం తోడుగా నీడగా నిలుస్తోన్న సహధర్మచారిణి ఎడబాటు అతన్ని తీవ్రంగా బాధిస్తోంది. తల్లితో అంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న తండ్రి... తల్లడిల్లుపోవడాన్ని చూసి కుమార్తె తట్టుకోలేకపోయింది. అందుకే మరిచిపోలేని కానుకను తండ్రికి అందించింది. అతడి కళ్లలో ఆనందాన్ని నింపింది..

silicone wax
silicone wax

By

Published : Nov 14, 2021, 2:19 PM IST

విజయవాడ(vijayawada) చుట్టిగుంట సమీపంలో నివాసం ఉంటోన్న మండవ కుటుంబరావుకు నాలుగు దశాబ్దాల క్రితం కాశీ అన్నపూర్ణతో వివాహమైంది. వ్యవసాయం- ప్రకృతి సేద్యంపై మమకారంతో తన కుమార్తెకు సశ్య అని పేరు పెట్టి.. తమ నివాసాన్ని సస్యక్షేత్రంగా మార్చేశారు ఈ దంపతులు. నిత్యం బంధుమిత్రుల రాకపోకలతో సందడిగా ఉండే ఇంట్లో... ఏడాదిన్నర క్రితం నుంచి మౌనం ఆవహించింది. భార్య అన్నపూర్ణ అకాలమరణం కుటుంబరావును కోలుకోలేని దెబ్బతీసింది.

తల్లి పుట్టిన రోజున తండ్రికి కానుక..
భార్య అన్నపూర్ణ ఆలోచనల నుంచి కుటుంబరావు బయటపడలేక పోవడాన్ని.. తన కుమార్తె సశ్య గుర్తించింది. ఎలాగైనా తన తండ్రి ఒంటరితనాన్ని దూరం చేయాలనుకుంది. విజయవాడలోని శిల్పశాల నిర్వాహకులతో చర్చించి... అన్నపూర్ణ విగ్రహాన్ని(silicone wax) తయారు చేయించింది. తన తల్లి పుట్టిన రోజున.. నాన్న పక్కన అమ్మను కూర్చోబెట్టాలనే తన పట్టుదలకు కార్యరూపం ఇచ్చింది. .తన కుమార్తె ఆలోచన కాదనలేకపోయిన కుటుంబరావు … తన భార్య రూపాన్ని చూసి సజీవంగా తన చెంతనే ఉన్న అనుభూతిని పొందుతున్నారు.

మరణించిన తల్లిని.. మళ్లీ తండ్రి చెంతకు చేర్చిన కూతురు!

నిజంగా బతికి వచ్చారా..!
అన్నపూర్ణ విగ్రహాన్ని(Annapurna idol) చూసి నిజంగా బతికి వచ్చారా అని ఆమె బంధవులు ఆశ్చర్యపోతున్నారు. చెమ్మగిల్లిన కళ్లతో, బరువెక్కిన గుండెలతో విగ్రహాన్ని తాకుతూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అన్నపూర్ణ రూపం, ఆహార్యం సజీవంగా నిలిచేలా చేసేందుకు స్వదేశీ, విదేశీ వస్తువులను వినియోగించామని విగ్రహ తయారీదారులు చెప్పారు. సాధారణ విగ్రహాల మాదిరిగా కాకుండా మట్టి విగ్రహానికి.. మైనం పూత పోసి 40 రోజుల్లో విగ్రహాన్ని చేశామని వెల్లడించారు.

మళ్లీ ఇంట్లో సందడి
అన్నపూర్ణ విగ్రహం ఇంటికి రావడంతో నెలల తరబడి స్తుబ్దుగా ఉన్న కుటుంబరావు ఇంట్లో... మళ్లీ సందడి నెలకొంది. భౌతికంగా ఆమె దూరమైనా... బంధుమిత్రులంతా అన్నపూర్ణ విగ్రహం వద్ద ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి వారి ప్రేమను చాటుకున్నారు.

ఇదీ చదవండి

POLLING START: స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ABOUT THE AUTHOR

...view details