మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. కార్పొరేషన్‌లో గతంలో 59 డివిజన్లు ఉండగా.... పునర్విభజన తర్వాత ప్రస్తుతం 64 డివిజన్లకు పెరిగాయి. ప్రతి డివిజన్‌కు ఒక్కో పార్టీ నుంచి నలుగురి నుంచి ఐదుగురు పార్టీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
తెదేపా నుంచి నలుగురు పోటీ..
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా బలపడింది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈసారి ఎన్నికల్లోనూ చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉంది. మేయర్ పదవి కోసం తెలుగుదేశం నుంచి ప్రధానంగా నలుగురు మహిళలు రేసులో ఉన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. తన కుమార్తె కేశినేని శ్వేతను బరిలో దింపుతున్నారు. నగరంలో పట్టున్న ప్రాంతమైన 11వ డివిజన్ నుంచి శ్వేత నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ కేశినేని నాని తరఫున శ్వేత వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.
మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నారు. దివంగత నేత దేవినేని బాజీ సతీమణి అయిన ఈమె.. గతసారి 2వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా భార్య బొండా సుజాత మేయర్ రేసులో ఉండగా.... తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ పేరూ వినిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 64 డివిజన్లలో అత్యధిక సీట్లలో గెలుపొందిన పక్షం నుంచి మహిళకు నగర మేయర్ పదవి దక్కనుంది.
ఆ నియోజకవర్గాలే కీలకం