మార్చి 20, శుక్రవారం. ఆ రోజున ఏం జరిగింది? ఇప్పుడు పోలీసుల దృష్టి అంతా దానిపైనే ఉంది. దిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సు నుంచి తిరిగి వచ్చాక పలువురు తబ్లిగీలు మర్కజ్ విశేషాల గురించి వివరించేందుకు ఆరోజున ప్రార్థనాస్థలాలకు వెళ్లడం కీలకంగా మారింది. ఆ సమయంలో వారు ఎవరెవరిని కలిశారు..? వారిలో వృద్ధులెవరు..? అని ఆరా తీస్తున్నారు.
సహకరించకపోవడం వల్ల..
రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారికి కరోనా సోకితే ఆ లక్షణాలు బహిర్గతం కాకున్నా వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలుండటం వల్ల పోలీస్‌శాఖ అటు వైపు దృష్టి సారించింది. తబ్లిగీల నుంచి ఇలాంటి పరిస్థితుల్లోనే వారి కుటుంబ సభ్యులతోపాటు ఇతరులకూ వైరస్ సోకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. మరోవైపు పలువురు ఈ విషయాల గురించి చెప్పేందుకు సహకరించకపోవడం వల్ల ఇప్పటికే స్వాధీనం చేసుకున్న వారి సెల్‌ఫోన్లను విశ్లేషిస్తున్నారు. కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
బిహారీ యువకుల నుంచే మహిళకు కరోనా?
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళ మరణంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బిహారీ యువకులు ఆమె ఇంట్లోనే అద్దెకుండటం వల్ల వారి నుంచే ఆమెకు కరోనా సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తబ్లిగీ జమాత్ కార్యకర్తలు తిరిగి వచ్చిన రైలులోనే ఈ బిహారీ యువకులు రావడం.. వారిలో కరోనా లక్షణాలు బయటపడకపోయినా వారి నుంచి మహిళకు సోకిందన్న అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.