మరో 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతానికి ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. తదుపరి 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నట్లు చెప్పింది.
పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర కోస్తా తీరం వైపు కదులుతుందని.. ఉత్తరాంధ్ర లేదా దక్షిణ ఒడిశా ప్రాంతంలో వాయుగుండం తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. రేపటినుంచి 3 రోజులపాటు కోస్తాంధ్ర, యానాంకు వర్ష సూచనలున్నట్లు తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని ఐఎండీ హెచ్చరించింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలున్నట్లు ఐఎండీ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు చెప్పింది.