ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆక్వా ఉత్పత్తులకు త్వరలో రాష్ట్రంలో అథారిటీ'

ఆక్వా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. త్వరలోనే ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్రంలో ఓ అథారిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరోవైపు గుజరాత్‌లో చిక్కుకున్న మత్య్సకారులను రోడ్డు మార్గంలో రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మోపిదేవి తెలిపారు.

mopidevi
mopidevi

By

Published : Apr 27, 2020, 9:36 PM IST

ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్రంలో త్వరలోనే ఓ అథారిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి మోపిదేవి స్పష్టం చేశారు. ఆక్వా ఉత్పత్తులపై దేశంలోనే తొలిసారిగా నిర్దేశిత ధర కల్పించామని.. ఈ విషయంలో పొరుగు రాష్ట్రాలకు ఏపీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రొయ్య పిల్లల సరఫరాకు సంబంధించి హేచరీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. రొయ్య పిల్లలను 35 పైసలకే రైతులకు సరఫరా చేయాల్సిందిగా సూచించినట్లు వివరించారు. ప్రస్తుతం బ్రూడర్ రొయ్యను కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు నిబంధనలు సడలించారని తెలిపారు. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మాత్రమే తల్లి రొయ్యలు దిగుమతి అవుతాయని.. అక్కడే ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి వైరస్‌లు ఏమీలేవని నిర్ధారించుకున్న తర్వాతే హేచరీలకు సరఫరా అవుతాయన్నారు. వేల కోట్ల విలువైన ఆక్వా రంగాన్ని పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. మరోవైపు గుజరాత్‌లో చిక్కుకున్న మత్య్సకారులను రోడ్డు మార్గంలో రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు మోపిదేవి తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని అనుమతులు లభించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details