విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఈనెల 5న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రైతు సంఘాల సమన్వయ సమితి సంపూర్ణ మద్దతు పలుకుతుందని... ఆ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... దిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమం 100 రోజులకు చేరుకోబోతున్న సందర్భంగా రాష్ట్రంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై విజయవాడలో సమావేశం నిర్వహించారు.
'యాంటీ కార్పొరేట్' ఉద్యమం చేపడతాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు
కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 5న పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు రైతు సంఘాల సమన్వయ సమితి సంపూర్ణ మద్దతు పలుకుతుందని స్పష్టం చేశారు.
ఈనెల 18 నుంచి 23 వరకు ఛలో దిల్లీ కార్యక్రమం చేపట్టాలని... 23న భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా 'యాంటీ కార్పొరేట్' ఉద్యమం చేపట్టాలని నిరాయించినట్టు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. వచ్చే నెలలో జాతీయస్థాయి నాయకులతో పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎరువులపై 150, డీఏపీపై 20 రూపాయలు పెంచి రైతులపై భారం మోపారని... పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై భారాలు మోపారన్నారు. మూడు చట్టాలను ఉపసంహరించుకోవాలని... లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్