హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఒకప్పుడు చిన్నా పెద్ద కలిసి దాదాపు 650 చెరువులు ఉండేవి. వీటి మధ్య గొలుసుకట్టుగా నాలాల వ్యవస్థ కూడా ఉండేది. గత కొన్నేళ్లుగా వందల ఎకరాల్లో ఉన్న చెరువులు, నాలాలను అనేకమంది ఆక్రమించారు. దీంతో ప్రస్తుతం 185 చెరువులు మాత్రమే మిగిలాయి. చాలాచోట్ల నీటిని బయటికి పంపించే తూములు మూసుకుపోయాయి.
ఇది తెగితే... 70 వేల మందిపై ప్రభావం
జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు ఉగ్రరూపం దాల్చడంతో కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వరకాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. 642 ఇళ్లు మునిగి 2500 మంది వరకు రోడ్డున పడ్డారు. చెరువుకు 37 అడుగుల సామర్థ్యం ఉండగా 34 అడుగుల ఎత్తుకు నీరు చేరింది. కట్ట తెగితే జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో 70 వేల కుటుంబాల వారు నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఉంది. దీనికున్న తూము పూర్తిగా పూడుకుపోయింది. మంగళవారం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజినీర్లు వచ్చి తూము తెరవడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో చుట్టుపక్కల బస్తీల వారు భయాందోళనకు గురవుతున్నారు.
వీటిలో దాదాపు 100 కుపైగా చెరువుల్లో ఇప్పుడు నీరు గరిష్ఠ స్థాయికి చేరింది. కట్టలు బలహీనంగా ఉండటంతో మరోసారి భారీ వర్షం పడి , నాలుగైదు అడుగుల నీరుచేరితే అవి తెగే ప్రమాదం ఉందని కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు, స్థానికులు చెరువు కట్టల వద్ద 24 గంటలపాటు కాపలాగా ఉంటున్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు కూడా ఇప్పుడు వీటిపై దృష్టిసారించారు.చెరువుకట్టల పటిష్ఠానికి చర్యలు చేపడుతున్నారు. తూములను తెరిచే పనిని మొదలుపెట్టారు. మరోవైపు చెరువుల పైభాగంలోని కాలనీల వారు కట్టలకు గండికొట్టడానికి ప్రయత్నిస్తుంటే కింది భాగంలో ఉన్న వారు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అధికారుల పరిశీలన ప్రకారం ఈ వంద చెరువుల దిగువ భాగంలో దాదాపు అయిదు లక్షలమంది నివాసం ఉంటున్నారు.
* మీర్‌పేట చెరువు దాదాపుగా నిండిపోయింది. గండిపడితే సరూర్‌నగర్, బాలాపూర్ తదితర సమీప ప్రాంతాలను నీరు ముంచేస్తుంది. దాదాపు 50 వేల మంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
* బండ్లగూడ తటాకం పొంగడంతో ఇప్పటికే మూడు కాలనీలు మునిగిపోయాయి. ఈ కట్టకు గండిపడితే దాదాపు పన్నెండు కాలనీల్లో ఉండే వేలాదిమంది ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.
* రాజేంద్రనగర్ పరిధిలోని పల్లెచెరువుకు గండిపడి ఇప్పటికే ఎనిమిది మంది మరణించారు. గండిపూడ్చినా మళ్లీ వర్షపు నీటితో నిండిపోయింది.
* వనస్థలిపురం కప్రాయ్ చెరువు నిండిపోవడంతో పది రోజుల కిందటే నాలుగు కాలనీల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ చెరువు కట్టకు గండిపడితే అనేక కాలనీలు ముంపునీటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.