VROs protest against Minister Appalaraju: మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా వీఆర్వోల అసోసియేషన్ నిరసన చేపట్టింది. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా అధికారులను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి అన్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మచిలీపట్టణంలో నిరసనలు..
VROs protest At Machilipatnam: వీఆర్వోలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి సీదిరి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని వీఆర్వోలు డిమాండ్ చేశారు. ఈమేరకు కృష్ణా జిల్లా వీఆర్వోల జిల్లా సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్టణం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మంత్రి.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే భవిష్యత్తులో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరతూ.. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు.
కడప జిల్లాలో..
VROs protest At Kadapa: మంత్రి అప్పలరాజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కడప జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో కడపలోనూ వీఆర్వోపై కొంతమంది దాడి చేస్తే.. దానికి రాజకీయ నాయకులు వత్తాసు పలకడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ పథకాలు అన్నింటిని ప్రజల్లోకి చేర వేస్తున్న తమపై ఇలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.