ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడం, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా నియమించిన వాలంటీర్ల వ్యవస్థ... నేటి నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడలో వాలంటీర్ల వ్యవస్థను లాంఛనంగా ప్రారంభిస్తారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఓ వాలంటీర్ ను నియామకాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. గ్రామాల్లో లక్షా 82వేలు, పట్టణాల్లో 64వేల మందిని నియమించారు. 2లక్షల 46వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించడం... సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఎలా పరిష్కరించాలో శిక్షణలో వివరించారు. పురపాలికలు, గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లకు నెలకు రూ.5వేల గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వనుంది.
పట్టణాలు , గ్రామాల్లోని వాలంటీర్లు పరిపాలనలో కీలకంగా వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్దేశించిన 50ఇళ్ల పూర్తి సమాచారాన్ని వీరు సేకరించనున్నారు. వివిధ పథకాల కింద ప్రజలు పొందిన ప్రయోజనాలపై నివేదిక రూపకల్పన చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలపై అవగాహన కల్పించడం... అర్హులైన వారికి ప్రయోజనాలు అందేలా సహకారం వాలంటీర్లు అందిస్తారు. రహదారులు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల సమస్యలపై దృష్టి పెడతారు. తాగునీటి సదుపాయం, పారిశుద్ద్యం, పరిసరాల పరిశుభ్రత, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్య విధులుగా ప్రభుత్వం తెలిపింది.