గౌరవ వేతనం రూ.12 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గ్రామ, వార్డు వాలంటీర్లు సోమవారం రాష్ట్రంలోని పలు చోట్ల ధర్నాకు దిగారు. ‘కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. అయినా శ్రమకు తగిన గుర్తింపు లేదు. సేవాభావంతో పనిచేస్తే నెలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.5 వేలేనా’ అని నినాదాలు చేశారు. ‘పనిభారం పెరిగింది.. అధికారుల నుంచి అవమానాలూ ఎదుర్కొంటున్నాం. ఫిబ్రవరిలో మొదలైన రేషన్ డెలివరీకి నెలకు రూ.21 వేలిస్తూ.. 18 నెలలుగా కష్టపడుతున్న వాలంటీర్లకు నెలకు రూ.5 వేలా? మమ్మల్ని ఇంత చిన్నచూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు’ అని వాపోయారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సోమవారం సుమారు 3 వేల మంది వాలంటీర్లు నిరసనలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన సిబ్బంది ప్రధాన గేట్లను మూసేశారు. దీంతో వాలంటీర్లు రహదారిపై నిరసనకు దిగారు. అనంతరం కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈలోపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వాలంటీర్లు తరలిరావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లు, తాళ్లతో వారిని ప్రధాన రహదార్ల వైపు రానీయకుండా అడ్డుకున్నారు. ముందుకొస్తున్న వారిని వెనక్కు నెట్టేశారు. దీంతో ఆగ్రహించిన వాలంటీర్లు మూడువైపులా రహదారులపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. దీంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. వాహనాలు ముందుకు కదలకుండా వాలంటీర్లు అడ్డు నిలవడంతో పోలీసులు వారిని పక్కకు నెట్టేసి, బలవంతంగా కొంతదూరం తీసుకెళ్లారు. అయినా విడవకుండా వాహనాల వెంట పరుగులు తీయడంతో పోలీసులు వారితో మాట్లాడారు. నిరసన విరమించి, వెళ్లిపోతే అందరినీ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకుని.. వాలంటీర్ల డిమాండ్లను ఉన్నతాధికారులతో పాటు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు కొంతదూరం తీసుకెళ్లి వదిలిపెట్టారు. తర్వాత జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌ను కలిసిన వాలంటీర్లు తమ డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చారు.