ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వీఎంసీ: పారిశుద్ధ్య కార్మికులకు పస్తులు తప్పడంలేదు..! - VMC Latest news

విజయవాడ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ ఎలవెన్సులు 7 నెలలుగా నిలిచిపోయాయి. పారిశుద్ధ్య సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కింద నమోదు చేయాల్సి రావటం... ఏజెన్సీ నుంచి జీతాలు సకాలంలో అందక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు పస్తులు తప్పడంలేదు
పారిశుద్ధ్య కార్మికులకు పస్తులు తప్పడంలేదు

By

Published : Apr 19, 2021, 4:34 AM IST

పారిశుద్ధ్య కార్మికులు

విజయవాడ నగరంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నెలవారి వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రధానంగా వారి వేతనాల చెల్లింపులతోపాటు, వారికి సంబంధించిన ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎలవెన్సు(ఓహెచ్‌ఏ) చెల్లింపుల్లోనూ అనేక అడ్డంకులు తప్పడంలేదు. ఫలితంగా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

సానుకూల దృక్పథం ఏదీ..?

నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో అందరికంటే ముందుగా ప్రతీనెలా 1న వేతనాలు అందేవి. అధికారులు ముందు వారికి వేతనాలు చెల్లించిన అనంతరమే తాము తీసుకుందామంటూ సానుకూల దృక్పథంతో ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అధికారులు, ఉద్యోగులు, పీహెచ్‌ వర్కర్లు, ఇతరులకు 010 పద్దుకింద ట్రెజరీ ద్వారా జీతాలు అందుతుండగా... పారిశుద్ద్య సిబ్బందికి మాత్రం ఓ ఏజెన్సీ ద్వారా చెల్లిస్తున్నారు. ఫలితంగా ఆలస్యంగా వేతనాలు అందుతున్నాయి. అది కూడా కార్మికుల తరచూ ఆందోళనలు, నిరసనలు చేస్తేతప్ప వారి సమస్య పరిష్కారం కావడంలేదు.

అధికారుల నిర్లక్ష్యమే..

పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న డ్వాక్వా, సీఎంఇవై కార్మికులు నగరపాలక సంస్థ పరిధిలో 3,274 మంది ఉండగా... వారికి నెలవారి వేతనం కింద 5.89 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అందులో ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎలవెన్సు కింద ప్రతీ నెలా 1.96 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్ము వారికి నెలవారి కాకుండా ఎప్పుడో ఒకసారి అందుతోంది. అందుకు అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ, అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

అడుగడుగునా అడ్డంకులు...

ప్రభుత్వ ఆదేశాలపై నగరపాలక సంస్థ పరిధిలో ఒప్పంద పద్దతిన పనిచేస్తున్న డ్వాక్వా, సీఎంఇవై గ్రూపుల పారిశుద్ధ్య సిబ్బందిని కొద్దికాలం కిందట ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ కింద నమోదు చేయాల్సి వచ్చింది. నాటినుంచి వీరి వేతనాలను ఏజెన్సీకి జమ చేసిన అనంతరం అక్కడ నుంచి కార్మికుల ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా అడ్డంకులు, ఆటంకాలు, కష్టాలు తప్పడంలేదు. ఫలితంగా ఏనెలా వీరికి 1న వేతనాలు అందని పరిస్థితులు నెలకొంటున్నాయి. కార్మికులకు సంబంధించిన ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎలవెన్సు 7 నెలలుగా అందలేదు.

ఆటంకాలను అధిగమించినా...

సాంకేతిక సమస్యలు డ్వాక్వా, సీసీఎంఇవై పారిశుద్ధ్య సిబ్బంది వివరాలను అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి సక్రమంగాను, సకాలంలో పంపకపోవడం, వారి బ్యాంక్‌ అకౌంటు నెంబర్లు నమోదు చేయకపోవడం వంటి కారణాలు సమస్యకు కారణంగా ఉంటున్నాయి. ప్రస్తుతం అన్ని అవరోధాలు, ఆటంకాలను అధిగమించినా నెలవారి వేతనాల చెల్లింపుల్లో మాత్రం తీవ్రజాప్యం జరుగుతూనే ఉంది. ఈస్థితిలో పారిశుద్ధ్య సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పస్తులు ఉండాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది.

తీవ్ర జాప్యం..

నగరపాలక సంస్థలోని ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులకు 12వేల రూపాయలు వేతనంగాను, 6 వేలు ఓహెచ్‌ఏ కింద.. మొత్తంగా 18వేల చొప్పున ప్రతీనెలా చెల్లించాల్సి ఉంది. కొద్దికాలంగా కార్మికులకు కేవలం వేతనపు సొమ్ము 12వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదికూడా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇక ఆక్యుపేషనల్‌ హెల్త్‌ ఎలవెన్సు మాత్రం నెలవారి వారికి దక్కడంలేదు. ప్రస్తుతం 13.75 కోట్ల రూపాయలు 7 నెలల బకాయి కింద చెల్లించాల్సి ఉంది.

నిర్లక్ష్యమే..

ఆయా చెల్లింపుల్లో ప్రజారోగ్యం, ఎకౌంట్స్ విభాగాల అధికారులు, ఆయా శాఖల నిర్లక్ష్యమే ప్రధానకారణంగా కార్మికులు వాపోతున్నారు. వేతనాల చెల్లింపులో సంబంధిత అధికారులు తగిన శ్రద్ధచూపడంలేదంటూ కార్మికులు నిరసనలు, ఆందోళనలు, ధర్మాలు చేయాల్సిన పరిస్థితితులు ఉత్పన్నమవుతున్నాయి. అయినా సమస్య సకాలంలో పరిష్కారం కావడంలేదంటూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెలవారి వేతనాలు, హెల్త్‌ ఎలవెన్సు సొమ్ము క్రమం తప్పకుండా చెల్లించి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ...'కన్న తల్లిలాంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details