ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Gangadhar Reddy: వివేకా హత్య కేసు కీలక సాక్షి మృతితో కలకలం - viveka murder case witness Gangadhar Reddy

Gangadhar Reddy: మాజీ మంత్రి వై.ఎస్.వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం సంచలనమైంది. హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ఆయన మృతి చర్చనీయాంశమైంది.

viveka murder case witness Gangadhar Reddy suspicious death
వివేకా హత్య కేసు కీలక సాక్షి మృతితో కలకలం

By

Published : Jun 10, 2022, 7:07 AM IST

Gangadhar Reddy suspicious death:మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో.. ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం సంచలనమైంది. ఆయన అనారోగ్యంతో చనిపోయారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ మరణం తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. వివేకా హత్యకేసు దర్యాప్తునకు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన సీబీఐ బృందాలు ఇటీవలే మళ్లీ కడప చేరుకున్నాయి. గత మూడు రోజులుగా పలువుర్ని విచారిస్తున్నాయి.

రెండురోజుల కిందట పులివెందులలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి ఇల్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్‌ కో ఆర్డినేట్స్‌ తీసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి మరణించటం చర్చనీయాంశమైంది.

వాంగ్మూలం ఇచ్చి.. మళ్లీ మాట మార్చి

  • ‘కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించాం. ఆ నేరాన్ని నీపైన వేసుకుంటే అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తారు. నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తాం’ అంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని గతేడాది అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఇది సీఎం జగన్‌ బాబాయ్‌ హత్య కాబట్టి, తేడా జరిగితే భవిష్యత్తులో ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ని తాను తిరస్కరించానని ఆయన ఆ వాంగ్మూలంలో వివరించారు. తర్వాత ఏమైందో కానీ కొన్ని రోజులకే మాట మార్చారు.
  • శివశంకర్‌రెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే గంగాధర్‌రెడ్డి మాటమార్చారనే అనుమానం తమకు ఉందని శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టుకు సీబీఐ నివేదించింది. ‘గంగాధర్‌రెడ్డి మాకు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలను న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు గతేడాది నవంబరు 25న అంగీకరించారు. 27న వాంగ్మూలం నమోదు కోసం న్యాయస్థానంలో సీబీఐ తరఫున దరఖాస్తు చేశాం. 29న ఆయన మాట మార్చారు.
  • శివశంకర్‌రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ తనను బలవంతం చేసిందని, ఒత్తిడి తెచ్చిందంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయనను శివశంకర్‌రెడ్డి ప్రభావితం చేశారు’ అని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చిలో న్యాయస్థానం కొట్టేసింది.
    వారు నిజాలు చెప్పేస్తారేమోనని భయంగా ఉంది..

గంగాధర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అప్పట్లో సంచలనమైంది. అందులోని ప్రధానాంశాలివే..

  • అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిల ప్రణాళిక లేకుండా వివేకానందరెడ్డిని హత్యచేసే ధైర్యం ఎవరికీ ఉండదు. వారికి అత్యంత సన్నిహితుడిగా నాకు ఆ విషయం తెలుసు. వారి ముగ్గురి ఆదేశాల మేరకే ఘటనా స్థలంలో రక్తపుమడుగు శుభ్రం చేస్తున్నారని తెలిసిన తర్వాత ఆ హత్యలో వీరి ప్రమేయమే ఉండొచ్చని అనుకున్నా. అందుకే వారు ఆధారాలు ధ్వంసం చేశారు.
  • అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, వారి కుటుంబానికి వై.ఎస్‌.వివేకానందరెడ్డితో తీవ్ర శత్రుత్వం ఉంది. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. ఆయన ప్రతిష్ఠకు హాని కలిగించేందుకు యత్నించేవారు. రాజకీయ ఉనికి కోసం ఇదంతా చేసేవారు.
  • 2019 ఆగస్టు చివరి వారంలో శివశంకర్‌రెడ్డి వాట్సప్‌ కాల్‌ చేశారు. పులివెందులకు 8 కి.మీ దూరంలోని గోదాము వద్దకు రావాలని.. అత్యవసరంగా మాట్లాడాలని పిలిస్తే అక్కడికి వెళ్లాను. అప్పటికే అక్కడ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రమణారెడ్డి, డ్రైవర్‌ ఉన్నారు. రమణారెడ్డి నా ఫోన్‌ తీసేసుకుని గోదాములోని మొదటి అంతస్తుకు పంపించగా అక్కడ శివశంకర్‌రెడ్డి కూర్చొని ఉన్నారు. అక్కడే వివేకా హత్యానేరాన్ని నాపైన వేసుకోవాలంటూ ఆఫర్‌ ఇచ్చారు.
  • వివేకాను ఎందుకు.. ఎలా చంపావని దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పాలని శివశంకర్‌రెడ్డిని అడిగా. ‘వివేకా ఇంట్లో సొత్తు దోచుకోవటానికి వెళ్లగా.. ఆ శబ్దానికి ఆయన నిద్రలేచారు.. దాంతో చంపటం తప్ప వేరే దారి కనిపించలేదు’ అని చెప్పాలన్నారు. ఘటనాస్థలంలో లభించిన లేఖ గురించి పోలీసులు ప్రశ్నిస్తే ఏమని సమాధానమివ్వాలని ఆయన్ను అడగ్గా.. ‘కేసును పక్కదారి పట్టించేందుకు వివేకాతో బలవంతంగా లేఖ రాయించాం’ అని చెప్పాలన్నారు.

నిగ్గు తేలాల్సిన అంశాలివే..వివేకా హత్యానేరాన్ని తనపైన వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానంటూ శివశంకర్‌రెడ్డి ఆఫర్‌ చేశారని తొలుత సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి ఆ తర్వాత ఎందుకు మాటమార్చారు? ఆయన్ను ఎవరైనా బెదిరించారా? ప్రలోభపెట్టారా? వారెవరు?

  • గతేడాది అక్టోబరు 2న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి నవంబరు 29న వాంగ్మూలం కోసం సీబీఐ తనను బలవంతం చేసిందని, ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారు? ఆ కాలవ్యవధిలో ఎవరెవరు సంప్రదించారు?
  • సీబీఐ అధికారులపై అతను అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడం వెనుక ప్రోద్బలం ఎవరిది?
  • గంగాధర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులతో గత కొన్ని నెలలుగా ఎవరైనా సంప్రదింపుల్లో ఉన్నారా? వారెవరు

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details