FESTIVAL CELEBRATIONS: చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పుష్పాలంకరణతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు.
గుంటూరు అమరావతి రోడ్డులో మట్టి గణపతి విగ్రహానికి భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ పూజలు చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీ ప్రసన్న గణపతి దేవస్థానంలో 65వ గణపతి పక్షోత్సవాలు మొదలయ్యాయి. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో వజ్రకవచ అలంకారంలో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు.విశాఖ గాజువాకలో భారీ గణపతి కొలువుదీరాడు. 89 అడుగుల ఎత్తులో 6 టన్నుల బరువున్న భారీ విగ్రహాన్ని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దర్శించుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విజయనగరం వరసిద్ధి వినాయక ఆలయంలో తెదేపా సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చవితి వేడుకల్లో పాల్గొన్నారు. రోలుగుంట మండలం భోగాపురం పాఠశాలలో బాలలు మట్టిగణపతిని ప్రతిష్ఠించి వేడుకలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ విఘ్నేశ్వర ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తణుకు సజ్జాపురంలోని విఘ్నేశ్వరుడ్ని రాజకీయ నేతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఏలూరులో భారీ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.