కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఎప్పుడు.. ఎక్కడ అదుపు తప్పి కింద పడతామో తెలియదు. ఏకాగ్రత కూడగట్టుకుని.. జాగ్రత్తగా, నెమ్మదిగా బండి నడపాల్సిందే. అలా వెళ్లినా గమ్యం చేరేసరికి ఒళ్లు హూనం కావడం ఖాయం. సాధారణంగానే పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల కురిసిన వర్షాలు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేశాయి. ఈ నరకయాతన ఏళ్లుగా తప్పట్లేదంటున్నారు అక్కడి ప్రజలు.
పెనమలూరు మండలం మంతెన నుంచి తెన్నేరు వరకూ ఉన్న ఐదు కిలోమీటర్ల రోడ్డు.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. అడుగడుగునా గోతులే.. ఎటు చూసినా కంకర తేలిన రోడ్డే. చినుకు పడితే చాలు.. చెరువులను తలపించే రహదారి. ముందునుంచీ ఉన్న గోతులు ఇటీవలి వర్షాలకు ఇంకా పెద్దగా మారాయి. రెండేళ్లుగా రోడ్డుపై తట్టెడు మట్టి పోయలేదు. కారు, ద్విచక్రవాహనం.. ఇలా ఏ బండి బయటకు తీసినా ప్రయాణం ఓ సవాలే.
ఈడుపుగల్లు నుంచి ఉప్పులూరు మధ్య రోడ్డు పరిస్థితి మరీ దారుణం. బయటికి పొడుచుకుని ఉండే కంకర రాళ్లు.. ఏ వాహనాన్ని కింద పడేస్తాయో తెలీదు. రహదారిపై తారు లేచి.. రాళ్లు మొనిదేలి ఉంటున్నాయి. ఉప్పులూరు నుంచి మంతెన వెళ్లే రహదారి గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చిన్న పని కోసం విజయవాడ వెళ్లాలంటే.. చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు స్థానికులు.