పురపాలక ఎన్నికల వేళ విజయవాడ నగర తెలుగుదేశం పార్టీలో భగ్గుమన్న విభేదాలు అధినేత చంద్రబాబు దృష్టి సారించటంతో చల్లబడ్డాయి. ఆదివారం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఎంపీ కేశినేని నాని కనీస సమాచారం ఇవ్వలేదంటూ.. పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి నాగుల్‌మీరా ఆరోపించారు. బొండా ఉమా ఇంట్లో సమావేశమై నాని వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
ముగ్గురు నేతల విమర్శలపై కేశినేని నాని స్పందించారు. పార్టీ ఏది చెప్తే అది చేయటానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకునే హక్కుందన్నారు. తనకు ఎవరితోనూ విబేధాల్లేవని స్పష్టం చేశారు.
విజయవాడ తెలుగుదేశం నేతల బహిరంగ ప్రకటనలపై విశాఖ పర్యటనలో ఉన్న అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. వెంటనే టెలికాన్ఫరెన్స్ లో ముఖ్య నేతలతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు కేశినేని శ్వేత వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ.. ఆమె విజయానికి కృషి చేస్తామని బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రకటించారు.