ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగి... తమ దినచర్యను మొదలు పెడుతూ ఉంటారు. కానీ తందూరి చాయ్ పేరుతో మట్టికుండలో కాసిన టీని, మట్టి గ్లాసులో తాగితే ఆ రుచి వర్ణించడానికి వీలు కాదంటారు టీ ప్రేమికులు. విజయవాడ సత్యనారాయణ పురంలో ఓ యువకుడు తందూరి చాయ్ పేరుతో దుకాణాన్ని తెరిచాడు. ఉత్తర భారతదేశంలో ఎంతో పేరున్న ఈ తందూరి చాయ్ విజయవాడ వాసులకు రుచి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
తందూరి రోటి, తందూరి చికెన్ లాంటి పేర్లు విన్నాం.. వాటి టేస్ట్ కూడా చూశాం. తాజాగా తందూరి జాబితాలోకి మరో సరికొత్త ఐటమ్ చేరింది. అదే తందూరి చాయ్. తందూరి చాయ్ రుచే వేరంటున్నారు టీ ప్రియులు. మట్టిగ్లాసుల్లో టీ తాగితే వచ్చే మజా మాటల్లో వర్ణించలేమంటున్నారు. మట్టి పాత్రలను ఉపయోగించడం ద్వారా పర్యావరణంతోపాటు శరీరానికి కూడా మేలు జరుగుతోందని చెబుతున్నారు. ఇఫ్పటివరకు చాయ్‌ని ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసులలో తాగిన విజయవాడ జనం ప్రస్తుతం ఇలా మట్టి గ్లాసులో తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.