ఇప్పటికే పలు చోట్ల దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని స్టేషన్ల సీఐలను విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు అప్రమత్తం చేశారు. వారి పరిధిలో ఉన్న ప్రతి ప్రార్థనాలయాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. ఆలయాలు, చర్చిలు, మసీదులకు సంబంధించి ఆయా పోలీసుస్టేషన్ల పరిధిలో శాంతి కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిలో అన్ని మతాలకు సంబంధించిన పెద్దలను సభ్యులుగా చేర్చారు. వీటితో పాటు.. వార్డు డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో పదిమంది సభ్యులను చేర్చారు.
మెుదట ఆయా స్టేషన్ల పరిధిలోని ప్రార్థనాలయాలను సందర్శించిన పోలీసులు అక్కడ భద్రతపరంగా ఉన్న లోపాలను గుర్తించి నివేదికలను తయారు చేశారు. ఏ ప్రార్థనాలయంలో ఎలాంటి భద్రత లోపాలున్నాయనే దానిపై స్పష్టతకు వచ్చారు. అనంతరం వాటిని సరిదిద్దేందుకు ప్రార్థనాలయాల కమిటీల సభ్యులతో భేటీ అయ్యారు. వారితో అవగాహన సమావేశాలు నిర్వహించారు. లోపాల్ని సరిదిద్దాలని కమిటీలకు నోటీసులు జారీ చేశారు. దీంతో 60 శాతం ప్రార్థనాలయాల్లో భద్రత పెరిగిందని, ఆయా కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో మరింత ముమ్మరం చేయాలని సీపీ బత్తిన శ్రీనివాసులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
కమిషరేట్ పరిధిలోని దాదాపు అన్ని ప్రార్థనాలయాల్లో ఇప్పటికే శాంతి కమిటీలు, మత పెద్దలతో పోలీసులు సమావేశాలు నిర్వహించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రత ఆడిట్లను నిర్వహించే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆయా ఆడిట్లు నిర్వహించని సంస్థలు యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తి చేయాలని సూచించారు. భద్రత సిబ్బంది లేని ప్రార్థనా మందిరాలు 1131 ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కొన్నిచోట్ల భద్రత సిబ్బందిని నియమించారు. సిబ్బంది లేని చోట్ల వాలంటీరైనా కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆలయ కమిటీలకు సూచించారు.