ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎదురు సమాధానమిచ్చినందుకే మహేష్​ను హతమార్చాడు'

విజయవాడ పోలీసు కమిషనరేట్ ఉద్యోగి మహేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మహేష్​ను అకారణంగా హతమార్చినట్లు తేల్చారు. కేవలం ఎదురు సమాధానం ఇచ్చినందుకే మద్యం మత్తులో ఉన్న నిందితుడు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

mahesh murder case
mahesh murder case

By

Published : Oct 21, 2020, 5:21 AM IST

అమ్మాయిల విషయం మాట్లాడుకుంటున్నారనే అనుమానం.. దానిపై ప్రశ్నిస్తే తాను పోలీస్ శాఖ ఉద్యోగినంటూ‌ ఎదురు సమాధానం ఇవ్వడం అతనికి తీవ్ర కోపం తెప్పించింది. దీనికి మద్యం మత్తు తోడవడం, చేతిలో తుపాకీ ఉండటంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు. ఒకరి నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన పోలీస్‌ కమిషనరేట్‌ ఉద్యోగి గజకంటి మహేష్(33)‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బీరం సాకేత్ రెడ్డి ప్రవర్తన ఇది. విజయవాడలో సెటిల్ మెంట్లు, తెనాలిలో కిడ్నాపుల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన సాకేత్ రెడ్డి... మహేష్​ను అకారణంగా హత మార్చినట్లు పోలీసులు తేల్చారు. కేసు వివరాలను విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

డీల్ కోసం విజయవాడకు...

కడప ఎస్‌బీఐ కాలనీకి చెందిన బీరం సాకేత్‌రెడ్డి హైదరాబాద్‌లో కన్సల్టెంట్, ఇంటీరియర్‌ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ గతంలో జరిగిన ఓ వివాదంలో ఓ హోటల్‌ యజమాని సాకేత్‌పై చేయి చేసుకున్నాడు. అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి గత ఆగస్టులో బీహార్‌కు వెళ్లి ఓ తుపాకీ, 12 బుల్లెట్లను కొనుగోలు చేశాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన సాకేత్..‌.తన పాత సహచరుడు తెనాలికి చెందిన సందీప్‌ను సంప్రదించాడు. విజయవాడ మధురానగర్‌కు చెందిన ఓ వ్యక్తి కారణంగా తాను 2 లక్షల రూపాయలు నష్టపోయానని, అతన్ని బెదిరించాలని సందీప్ కోరాడు. అలాగే తెనాలికి చెందిన వెండి వ్యాపారిని కిడ్నాప్‌ చేస్తే కోటి రూపాయల వరకు వస్తాయని ఆశ పుట్టించాడు. దీనికి ఒప్పుకున్న సాకేత్... తన స్నేహితుడు, ఏలూరు వాసి గంగాధర్‌ అలియాస్‌ గంగూభాయ్‌ని తీసుకుని ఈనెల 10వ తేదీ ఉదయం విజయవాడకు చేరుకున్నారు. వీరిద్దరూ ఓ హోటల్‌లో దిగారు.

అకారణంగా...

తమతో పాటు తెచ్చుకున్న తెలంగాణ మద్యం తాగేందుకు నున్న బార్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. పాత పరిచయస్థుడు ముదిరెడ్డి రాధాకృష్ణారెడ్డి సొంత ఆటోలో ముగ్గురూ అక్కడికి వెళ్లారు. అదే సమయంలో మద్యం తాగేందుకు మహేష్‌, అతని స్నేహితులు కూడా అదే ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగేందుకు వేచి చూస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న సాకేత్‌రెడ్డి అక్కడకు వచ్చి.. 'ఎవడ్రా ఇక్కడ అమ్మాయిల గురించి మాట్లాడుతోంది?' అని ప్రశ్నిస్తూ.... కారులో ఎవరైనా అమ్మాయి ఉందేమోనని చూశాడు. ఈ క్రమంలో తాను పోలీసు శాఖ ఉద్యోగినని‌ మహేష్‌ గట్టిగా చెప్పటంతో...కోపానికి లోనైన సాకేత్ తుపాకీని బయటకు తీసి ఇష్టానుసారంగా వారిపై కాల్పులు జరిపాడు. తూటాలు నేరుగా తగలటంతో మహేష్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గంగాధర్ ముఖానికి కూడా ఓ తూటా తగిలి స్వల్ప గాయమైంది.

ఆటో విప్పిన గుట్టు

సంఘటన స్థలంలో ఆటోలో ముగ్గురు వ్యక్తులున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ కోణంగా దర్యాప్తు చేశారు. ఆటో శాంతినగర్​కు చెందిన రాధాకృష్ణారెడ్డిదని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మిగతా నిందితుల గుట్టు వీడటంతో సాకేత్ రెడ్డి, జాన గంగాధర్​లను సైతం అరెస్టు చేశారు. వారి నుంచి మ్యాగజైన్​తో కూడిన తుపాకీ, ఆటో స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

క్రికెట్ బెట్టింగ్ అప్పు తీర్చేందుకు చిన్నారి హత్య

ABOUT THE AUTHOR

...view details