ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధి మారబోతుందా? - విజయవాడ వార్తలు

విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధి మారబోతోంది. కమిషనరేట్ పరిధిలో మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. 18 పోలీసు స్టేషన్​లు అదనంగా సీపీ కార్యాలయ పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున కమిషనరేట్​ పరిధి మారనుంది. దీనిపై అధికారులతో చర్చలు జరిపేందుకు నివేదికలు తయారు చేస్తున్నారు.

Vijayawada police commissionarate
Vijayawada police commissionarate

By

Published : Nov 11, 2020, 6:38 PM IST

విజయవాడ కమిషనరేట్ విస్తృతం కాబోతుంది. సీపీ పరిధిలోకి మరో 18 పోలీసు స్టేషన్లు రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోకి పీఎస్​లన్నింటిని విజయవాడ సీపీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

సూపరింటెండెంట్​ పరిధిలోకి

జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, హనుమాన్ జంక్షన్ సర్కిళ్లను కమిషనరేట్ పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట సర్కిల్​లో వత్సవాయి, చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు పీఎస్​లున్నాయి. నందిగామ సర్కిల్ పరిధిలో చందర్లపాడు, వీరులపాడు, కంచికచర్ల, నందిగామ పీఎస్​లు ఉన్నాయి. తిరువూరు సర్కిల్ పరిధిలో విస్సన్నపేట, చాట్రాయి, గంపలగూడెం, తిరువూరు పీఎస్​లున్నాయి. మైలవరం సర్కిల్ పరిధిలో ఏ.కొండూరు, జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం పీఎస్​లు ఉన్నాయి. హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో వీరవల్లి, హనుమాన్ జంక్షన్ పీఎస్​లున్నాయి. ఈ ఐదు సర్కిల్ ఇన్​స్పెక్టర్లు జిల్లా సూపరింటెండెంట్ పరిధిలోకి వస్తారు.

అయితే జిల్లాల మార్పులో వీటిని విజయవాడ పోలీసు కమిషనరేట్​లోకి తెచ్చేందుకు నివేదికలు తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఉయ్యూరు సర్కిల్ పరిధిలో ఉన్న తోట్లవల్లూరు, పమిడిముక్కల పోలీసు స్టేషన్​లు జిల్లా ఎస్పీ పరిధిలోకి వెళ్లనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు జాబితా తయారు చేస్తున్నారు. అయితే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కమిషనరేట్ పరిధిలోకి వస్తుందా? లేక పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా మార్చాలని ప్రతిపాదన ఉన్నందున విజయవాడ జిల్లాగా మారుతుందా అనే విషయంపై పూర్తిస్థాయి కసరత్తు జరపనున్నట్లు ఉన్నతాధికారులు చెపుతున్నారు.

ఆ స్టేషన్ సీపీ పరిధిలోనే

మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని విజయవాడ కమిషనరేట్‌లో ఉన్న పోలీసుస్టేషన్లను బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నగర శివార్లలోని నున్న, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు స్టేషన్లు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రాంతాలు విజయవాడతో కలిసిపోవడంతో, పోలీసుస్టేషన్లను తిరిగి విజయవాడ కమిషనరేట్​కు బదలాయించాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరనున్నారు. గన్నవరం స్టేషన్‌ పరిధిలో విమానాశ్రయం ఉండటం, అక్కడకు వచ్చిన ప్రముఖులంతా విజయవాడ నగరానికి వస్తుంటారు. వీవీఐపీ భద్రత దృష్ట్యా ఈ స్టేషన్‌ను సీపీ పరిధిలోనే ఉంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ విషయంపై నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

జనాభా, కేసుల వివరాలు సేకరణ

ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో ఉండి.. రానున్న రోజుల్లో కృష్ణా జిల్లాలో కలిసే పోలీసు స్టేషన్ల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్ల వివరాలు, వాటి పరిధిలో ఉండే జనాభా? ఏడాదికి నమోదయ్యే కేసుల వివరాలను నివేదికల రూపంలో సేకరిస్తున్నారు. విజయవాడ నగరంలో జనాభా 13 లక్షల మంది ఉంటారు. గ్రామీణ జనాభా 5,39,720 మంది ఉన్నారు. నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాలు కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి.

ఇదీ చదవండి

తుంగభద్ర పుష్కరాల్లో.. పురోహితులెవరు?

ABOUT THE AUTHOR

...view details