విజయవాడ గ్యాంగ్ వార్ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. రెండ్రోజుల క్రితం పండు గ్యాంగ్‌లో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు.... తాజాగా సందీప్ గ్యాంగ్‌లోని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో మృతుడు సందీప్ సోదరుడు జగదీష్, మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. రెండు గ్యాంగ్‌లలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. సందీప్ గ్యాంగ్‌లోని కిరణ్‌కుమార్ తొందరపాటు వల్లే గొడవ జరిగిందని డీసీపీ వివరించారు.
అపార్టుమెంట్ సెటిల్‌మెంట్ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. అపార్టుమెంట్ సెటిల్‌మెంట్ గొడవ, గ్యాంగ్‌వార్‌పై వేర్వేరుగా కేసులు నమోదు చేశామన్నారు. పండు తల్లి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.