రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం... లక్ష్మీనారాయణ అనే వ్యక్తి రోడ్డు పక్కన చెరుకు రసం విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట వన్ టౌన్ పోలీసులు చెరుకు రసం మిషన్ తీసుకెళ్లారు. ఇంత వరకు ఇవ్వలేదు .. పోలీసు స్టేషన్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఏళ్లు గడిచినా ఫలితం లేదు. ఇప్పుడా మిషన్ ఎక్కడుందో సమాధానం చెప్పే వారే లేరని సీపీకి ఫిర్యాదు చేశాడు.
పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ వ్యక్తి హఠాత్తుగా మరణించాడు. మరణానంతరం కుటుంబానికి రావాల్సిన డబ్బుల కోసం భార్య వెళ్లింది. కానిస్టేబుల్ పొందుపరిచిన వివరాల్లో తన పేరు లేదని అధికారులు వెనక్కి పంపారంటూ ఓ మహిళ సీపి దగ్గర బోరుమంది. తన భర్త పేరు మార్చుకుని సూర్యారావుపేటలో మరో మహిళతో కాపురం చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని సత్యనారాయణపురానికి చెందిన మహిళ ఫిర్యాదు చేసింది.
అన్నింటినీ విన్న కమిషనర్ ద్వారకా తిరుమలరావు... స్థానిక పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరించటమే కాదు... పనితీరునూ పరిశీలిస్తామని సీపి తెలిపారు. కొద్ది రోజుల తర్వాత కేసుల వివరాలు ఫిర్యాదుదారులకు తెలియచేస్తామన్నారు.