వ్యాపారం పరంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రాంతం.. పచారీ వస్తువుల టోక్‌మార్కెట్ ఉన్న బస్తీ గొల్లపూడి. విజయవాడలో కలసిపోయి ఉండే గొల్లపూడిని పంచాయతీ అని చెబితేనే కానీ చాలా మందికి తెలియదు. దీన్ని నగరంలో విలీనం చేయడం మాట అటు ఉంచితే.. ఇప్పుడు నాలుగు ముక్కలు చేశారు. ప్రస్తుతం వీటికి ఎన్నికలు జరుగడం లేదు. విజయవాడ నగరంలో విలీనం కావాలన్న ఈ ప్రాంత వాసుల కోరికలకు విరుద్ధంగా నాలుగు పంచాయతీలుగా విభజించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అన్నిచోట్లా ఏటా జనాభా పెరుగుతుంది. కానీ మచిలీపట్నంలో తగ్గుతోంది. 1970 నుంచి ఇదే పరిస్థితి. పేరుకే జిల్లా కేంద్రం.. అధికార యంత్రాంగం.. కలెక్టరేట్ అన్నీ విజయవాడ కేంద్రంగా క్యాంపు కార్యాలయాలకే పరిమితం. అలాంటి మచిలీపట్నం పురపాలక సంఘాన్ని కార్పొరేషన్‌గా మార్చారు. ఇక్కడ శివారు 9 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. తమ గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసినందుకు సంతోషించాలో.. ఎదుగు బొదుగూ లేని నగరంలో తమకు అభివృద్ధి ఫలాలు అందుతాయో లేదోనన్న అనుమానంతో ఉండాలో అర్థంకాని పరిస్థితి. ఇక్కడ 9 పంచాయతీలకు ఎన్నికలు నిలిపివేశారు.
విజయవాడ నగరం శివారు గ్రామాలు ఇక పంచాయతీలుగానే ఉండాలా..? అని స్థానికులు వాపోతున్నారు. ఎంతో కాంలం నుంచి విలీన ప్రతిపాదనలు ఉన్నా ఉత్తర్వులు మాత్రం వెలువడటం లేదు. సాధారణంగా జనాభా పెరుగుదల, జనసాంద్రత, ఆయా నివాసప్రాంతాల్లో ఉన్న పురుషులు 70 శాతం మంది వ్యవసాయేతర వృత్తుల్లో ఉండటం, పంచాయతీల ఆదాయం పరిగణలోకి తీసుకుని పట్టణాలుగా మార్చాలనేది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు. వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. విజయవాడ మహానగరంపై నిర్ణయాలు మారుతున్నాయి. పంచాయతీలలో అభివృధ్ధికి అవకాశం లేకుండా పోతోంది. రక్షితనీటి సరఫరా.. భూగర్భ మురుగునీటి వ్యవస్థ లాంటి సౌకర్యాలు మాత్రం అందడం లేదు.
ఇవీ పంచాయతీలు..!
గొల్లపూడి మేజర్ పంచాయతీని ప్రస్తుతం నాలుగు పంచాయతీలుగా విభజించారు. గొల్లపూడి జనాభా 2011 ప్రకారం 22,762. గొల్లపూడి, వైఎస్సార్ గ్రామపంచాయతీ, జక్కంపూడి, రామరాజ్యనగర్ పంచాయతీలుగా విభజించారు. వాస్తవానికి ఇవి నగరంలో కలిసి ఉంటాయి. జక్కంపూడిలో గత ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. జెట్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. మెట్రో కారిడార్‌కు ప్రతిపాదించారు. ప్రస్తుతం బైపాస్ దీని పక్కగా వస్తోంది. అలాంటి ఈ పంచాయతీని విలీనం చేయకపోగా నాలుగు ముక్కలు చేశారు.
- ఏలూరు రహదారిలో ఉన్న మొదటి పంచాయతీ రామవరప్పాడు. 2011 ప్రకారం మొత్తం జనాభా 22,222. ప్రస్తుతం 35వేలకు పైగా ఉంటారు. ఇటీవల కాలంలో అభివృద్ధి చెందింది. బహుళ అంతస్తులు భారీగా నిర్మాణం చేశారు. శివారులో వలస జనాభా పెరిగింది. నగరంలో అద్దెలు భరించలేని మధ్యతరగతి కుటుంబాలు రామవరప్పాడుకు వలస వెళ్లాయి. నగరంలో అంతర్భాగంగా ఉండే.. ఈ పంచాయతీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి.
- ఇదే మార్గంలో ప్రసాదంపాడు మేజర్ గ్రామం. నగరంలో కలిసిపోయిందే. 2011 ప్రకారం 13,941. ప్రస్తుతం 20 వేల పైగా ఉంది. ఎనికేపాడు మేజర్ గ్రామపంచాయతీ. జనాభా 11,039(2011ప్రకారం). నిడమానూరు జనాభా 13,581. ఈ పంచాయతీలకు విలీనం చేసేందుకు అర్హమైనవే. ఇవన్నీ విజయవాడ గ్రామీణ మండలం పరిధిలో ఉన్నాయి. నున్న పంచాయతీ మేజరే. 14,176 మంది జనాభా. వీటిని విలీనం చేయలేదు.
- నగరంలో కలిసి ఉండే కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి పంచాయతీలను కలిపి పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు. అయితే పక్కనే ఉన్న పెనమలూరును పక్కనపెట్టడం విశేషం. తామేమి పాపం చేశామని వారు ప్రశ్నిస్తున్నారు. పెనమలూరు పంచాయతీకి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ జనాభా 13,170. ఒక శాస్త్రీయంగా విలీనం చేయలేదని, తాము నగరంలో విలీనం కోరుకుంటే.. నగరం పక్కనే మున్సిపాలిటీ ఏర్పాటు చేసి తమను పక్కనపెట్టారన్న భావన పెనమలూరు వాసుల్లో వ్యక్తమవుతోంది.