VMC Council Meeting: అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్ల మాటల యుద్ధం నడుమ.. విజయవాడ నగరపాలక కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. నగర సమస్యలపై సమావేశంలో చర్చించాలని తెదేపా కార్పొరేటర్లు కోరగా.. అందుకు భిన్నంగా అధికారపక్ష కార్పొరేటర్లు వ్యవహరించారు. ఆస్తిపన్ను సహా ఓటీఎస్‌పై వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా కార్పొరేటర్లు నిలదీశారు. కొవిడ్ సహా అనేక సమస్యల నడుమ పేద ప్రజలు అల్లాడుతుంటే.., చెత్త పన్ను భారం ఏంటని ప్రశ్నించారు. వైకాపా కార్పొరేటర్లు కాలనీల్లోకి వెళ్తే ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుస్తాయన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైకాపాకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని తెదేపా కార్పొరేటర్లు మండిపడ్డారు.
తెదేపా కార్పొరేటర్‌పై సస్పెన్షన్ వేటు..
తెదేపా కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు.. ఓ మహిళా ఉద్యోగిని అవమానించారని వైకాపా కార్పొరేటర్లు ఆరోపించారు. ఆయనను సమావేశం నుంచి సస్పెండ్ చేయాలని అధికార పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టడంతో.. మేయర్ రాయన భాగ్యలక్ష్మి సాంబశివరావును సస్పెండ్ చేశారు.