హోరాహోరీగా సాగిన విజయవాడ నగరపాలక ఎన్నికల్లో మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు తెదేపా ఖాతాలో ఇప్పటికే ఆరు సీట్లు ఉండగా... అధికార వైకాపా చేతుల్లో రెండు సీట్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన 64 డివిజన్లకు అదనంగా ఇరు పార్టీలకు ఉన్న 8మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 72 స్థానాలు పరిగణనలోకి వస్తాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ అంటే.. సగానికి ఒకటి ఎక్కవ ఉండాలి. 37 ఓట్లు వచ్చిన వారు మేయర్‌గా విజయం సాధిస్తారు. ఈ నెల 14న ఈ లెక్క తేలనుంది.
ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 37స్థానాలు ఎవరికి ఉంటే వారు మేయర్ పీఠాన్ని కైవసరం చేసుకోనున్నారు. చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులకు నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో ఓటు హక్కు ఉంటే వారు ఎక్స్ అఫీషియో కిందకు వస్తారు. స్థానికంగా ఓటుహక్కు ఉన్న ప్రజాప్రతినిధులకు ఆప్షన్ లేకుండానే నేరుగా ఎక్స్ అఫీషియో పరిధిలోకి రానున్నారు. ఎన్నికలు జరిగిన పరిధిలో ఓటుహక్కు లేకుండా ప్రజాప్రతినిధులు జిల్లాకు ప్రాతినిధ్యం వహించే లోక్సభ సభ్యులు, రెండేసి జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే టీచర్ ఎమ్మెల్సీలు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సమయంలోనే తన ఎక్స్అఫీషియో హోదా ఎక్కడ వినియోగించుకోవాలనుకునేది ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
గవర్నర్ కోటా, స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలకూ ఈ ఆప్షన్ వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్థానికంగా ఓటు ఉన్న విజయవాడ ఎంపీ కేశినేనినాని, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు టీడీ జనార్థన్, అశోక్ బాబు, బుద్ధా వెంకన్న ఓట్లు కలిపి తెదేపా ఖాతాలో ఆరు ఓట్లున్నట్లు లెక్క.
జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఇద్దరు తెదేపాఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, బచ్చుల అర్జునుడుకు ఉయ్యూరు, మచిలీపట్నంలో ఓటు హక్కుంది. విజయవాడతో పాటు ఆ రెండు చోట్ల పురపోరు జరిగింది. అయితే వీరిద్దరు ఎన్నికలకు ముందే తమ ఆప్షన్ను స్థానికంగా ఇచ్చేశారు. విజయవాడ ఫలితం ఉత్కంఠ రేపితే వీరిరువురిలో ఆప్షన్ మార్చుకునే అవకాశాలు న్యాయపరంగా సాధ్యాసాధ్యాలను తెదేపా పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెదేపా ఖాతాలో స్థిరంగా 6 ఓట్లు ఉన్నందున మరో 31 డివిజన్లలో పార్టీ అభ్యర్థులు గెలుపొందితే బెజవాడ పీఠం తెదేపా వశమవుతుంది.
అధికార వైకాపాకు పశ్చిమ, సెంట్రల్ ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఈ పార్టీ అభ్యర్థులు 35 డివిజన్లలో విజయం సాధిస్తేనే మేయర్ పీఠం దక్కనుంది. ఇటీవల ఖరారైన ఎమ్మెల్సీల్లో నగరానికి చెందిన కరీమున్నీసాకు అధికార పార్టీ అవకాశం కల్పించింది. కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో దిగిన ఈమెకు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి లభించింది. ఆమె ఎమ్మెల్సీగా ఎంపికైనట్లు ఈ నెల 8వ తేదీనే ఖరారవటంతో ఎక్స్అఫీషియోగా పరిగణనలోకి వస్తారా లేదా అనే తర్జనభర్జన సాగుతోంది. దీనిపైనా స్పష్టత రావాల్సి ఉంది.