విజయవాడలోని కృష్ణలంక 21 వ డివిజన్లో.. బ్యానర్ల చించివేతపై రగడ నెలకొంది. సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి పుప్పాల కుమారి, స్థానిక నాయకురాలు నిమ్మల జ్యోతికలు శుభాకాంక్షలు తెలపాలనుకున్నారు. కృష్ణలంక సర్వీసు రోడ్డు, హైస్కూల్ రోడ్లలో.. అభినందనల పేరుతో రెండు వర్గాలూ బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఆయా ప్రాంతాల్లో కట్టిన బ్యానర్లు ఆదివారం ఉదయం తొలగించి ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది.
తూర్పు నియోజకవర్గ వైకాపా బాధ్యుడు దేవినేని అవినాష్ ఫొటోను ముద్రించలేదన్న నెపంతో.. ప్రత్యర్థి వర్గీయులు తమ బ్యానర్‌ను తొలగించి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీస్ స్టేషన్లో నిమ్మల జ్యోతిక ఆరోపించారు. అంకిత భావంతో పార్టీకి సేవలందిస్తున్నా.. తమను వేధింపులకు గురిచేయడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.