విజయవాడ ఇంద్రకీలాద్రిపై శార్వరీ నామ సంవత్సర దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని దేవస్థానం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. గతంలో కంటే ఈసారి భక్తుల తాకిడి గణనీయంగా తగ్గింది. ఉదయం 3 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవ.. స్నపనాభిషేకం, బాలబోగ నివేదన, నిత్యార్చనలు జరిగాయి. నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, ఆలయ ఈవో సురేష్‌బాబు దంపతులు అమ్మవారి ఉత్సవ మూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టగా.. కేరళ బృందం.. వాయిద్య నాదాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించారు.
తొలిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంతో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. గంటకు వెయ్యి మంది వంతున రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శనానికి అవకాశం ఇస్తున్నారు. సర్వదర్శనం, వంద రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ముందస్తుగా కేటాయిస్తున్నారు. వీటిని తీసుకున్నవారి వివరాలను పరిశీలించి.. ఆరోగ్య తనిఖీలు చేశాకే ఆలయం వద్దకు రానిస్తున్నారు.
వినాయక ఆలయం.. కుమ్మరిపాలెం వద్ద నుంచి వేర్వేరుగా ఇంద్రకీలాద్రి కొండపై వరకు 3 వరుసల క్యూలను ఏర్పాటు చేశారు. 4 చోట్ల థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ముందుగా సమయం నిర్దేశించి టిక్కెట్లు ఇవ్వడంతో క్యూ లైన్లలో రద్దీ, నిరీక్షణ లేకుండా వడివడిగా అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ముందుకు సాగారు. ఆన్‌లైన్ టికెట్లు లేని భక్తులకు ఆరోజు టైం స్లాట్ ప్రకారం ఖాళీ ఉంటే సీతమ్మవారి పాదాలు వద్ద ఏర్పాటుచేసిన దేవస్థాన కౌంటర్ వద్ద అప్పటికప్పుడు టికెట్లు ఇస్తున్నారు.
నవరాత్రుల సమయంలో అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు ప్రత్యక్షంగా కాకుండా కేవలం పరోక్షంగానే పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు తీసుకుంటే వారి గోత్రనామాలతో పూజలు చేసి ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. మహామండపంలో అమ్మవారి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక సేవలు చండిహోమం, ప్రత్యేక కుంకుమార్చన, శ్రీ చక్రార్చన పరోక్షంగా జరిపిస్తున్నారు.