విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను వచ్చే దసరాలోగా ప్రారంభించి.. ఆ తర్వాత దసరా నాటికి ప్రారంభింపజేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఛైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన కనకదుర్గమ్మ ఆలయంలో పాలకమండలి సమావేశం జరిగింది. ఆలయ అధికారులు రూపొందించిన 43 అజెండా అంశాలపై చర్చించింది.
ఇటీవల అనిశా, విజిలెన్స్ విభాగాల దాడులు చేసి పలు లోపాలను గుర్తించిన దరిమిలా టెండర్ల ఖరారు విషయంలో ఆచితూచి పాలకమండలి ఆమోద ముద్ర వేస్తోంది. నిబంధనలకు అనుగుణంగా టెండరులో తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనుల అప్పగించింది. పారిశుధ్య విభాగం.. పాలు, పెరుగు, వెన్న సరఫరా, శాశ్వత అన్నదానంలో కాయగూరల శుభ్రత, నిర్వహణ, ప్రసాదం తయారీ దిట్టం మార్పు వంటి పనులకు సంబంధించి తగిన ప్రమాణాలు లేని వాటిపై మళ్లీ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించింది. దీంతో పాటు కీలకమైన పనుల విషయంలో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి మేరకు పనుల అప్పగించాలని పాలకమండలి సూచించడం.. ఆలయ పరిధిలో వచ్చిన కీలకమైన మార్పుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
కరోనా ఆంక్షల సడలింపు తరుణంలో భక్తులకు మెరుగైన రీతిలో దర్శనం కల్పించాలని భావించిన పాలకమండలి.. ఇవాల్టి నుంచి ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు భక్తులు కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామిలను దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించడంతో ఈ మేరకు మార్పులు చేశారు. దేవస్థానంలో అమ్మవారికి, మల్లేశ్వరస్వామికి నిత్య కైంకర్యాలు ఏకాంతంగానే జరపాలని నిర్ణయించారు. పది రకాల ఆర్జిత సేవలను పరోక్ష పద్ధతిలో జరిపించుకోవచ్చని పాలకమండలి భక్తులకు సూచించించింది. కరోనా సమయంలో ఆర్జిత సేవలు- ఈ-హండీ, ఈ-సేవల ద్వారా 34 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు తెలిపింది.