CP Special Focus On Blade Batch : నేరాలను నియంత్రించేందుకు విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర వాసులను వణికిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ప్రవర్తనలో మార్పులు తెచ్చే దిశగా చర్యలు చేపట్టారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కొత్త కసరత్తు ప్రారంభించారు. నేర ప్రవృత్తి ఉన్న వారిలో మార్పు తీసుకురావడంతో పాటుగా వారిని... సమాజానికి దగ్గర చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు విజయవాడ పోలీసులు.
విజయవాడ బ్లేడ్ బ్యాచ్ కు అడ్డాగా మారుతోంది. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో నగరవాసులు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీరిని నగర బహిష్కరించినా, మళ్లీ కొన్నాళ్లకు షరా మామూలే. గంజాయి మత్తులో బ్లేడ్‌బ్యాచ్ చేసే ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. దారిదోపిడీలు, దౌర్జన్యం, అడిగిన వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం పరిపాటిగా మారింది. వీరి నేరాలను అరికట్టేందుకు, విజయవాడ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
ఇదీ చదవండి : Thieves robbing in locked houses: పగలు రెక్కీ.. రాత్రిళ్లు దోపిడీలు.. తాళం వేసిన ఇళ్లే లక్ష్యం!
వివిధ కారణాలతో మత్తు పదర్థాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారు.. బ్లేడ్ బ్యాచ్ సభ్యులుగా మారుతున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటే తమని తామే తీవ్రంగా గాయపర్చుకుంటారు. చివరకు గొంతు కూడా కోసుకుంటారు. పోలీసులు ఈ అంశాన్ని శాంతి, భద్రతల అంశంగానే పరిగణిస్తుండడంతో.. దీనికి సరైన పరిష్కారం దొరకడం లేదు. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించిన నగర పోలీసులు...మూలాల నుంచి నరుక్కురావాలని నిర్ణయించారు. ఈ సమస్యని సామాజిక కోణంలో చూసి వారి చెడు అలవాట్లను మాన్పించి, ఉపాధి కల్పించే దిశగా ఇకపై ముందడుగు వేయనున్నారు.