Vijayawada CP On Vangaveeti Radha Murder Attempt Issue: తెదేపా నేత వంగవీటి రాధాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. విజయవాడలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్న సీపీ.. పోలీసు అధికారులు రాధాతో మాట్లాడారన్నారు. రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన ఇచ్చిన సమాచారం తీసుకున్నామని.. ఈ ఘటనపై ఎలాంటి అ వాస్తవాలు ప్రసారం చేయొద్దని కోరారు. అన్ని కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోందన్న సీపీ.. నేరం, నేర ఘటన లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని.. సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నామని అన్నారు. పోలీసులతోపాటు రాష్ట్రస్థాయి ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తున్నాయన్నారు.
"వంగవీటి రాధాతో పోలీసు అధికారులు మాట్లాడారు. రాధాపై రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. వంగవీటి రాధాకు భద్రత ఏర్పాటు చేస్తామన్నాం. రాధా ఇచ్చిన సమాచారం తీసుకున్నాం. రెక్కీ అంటూ అవాస్తవాలు ప్రచారం చేయవద్దు. సీసీ ఫుటేజ్ పరిశీలన సహా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాం. నేరం, నేర ఘటన లేకుండా జీరో ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేస్తారు ? పోలీసులతో పాటు రాష్ట్ర స్థాయి ఏజెన్సీలూ దర్యాప్తు చేస్తున్నాయి." -కాంతి రాణా టాటా, విజయవాడ సీపీ
నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు: రాధా
కొందరు తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని.. తెదేపా నేత వంగవీటి రాధా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. చంపాలని చూసినా భయపడేది లేదన్న ఆయన.. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని తేల్చిచెప్పారు. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
"నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు. నన్ను చంపాలని చూసినా భయపడను, దేనికైనా సిద్ధం. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా. వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే లక్ష్యం" - వంగవీటి రాధా, తెలుగుదేశం పార్టీ నేత